తెలంగాణా మంత్రులలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక్కరే ఏదో ఒక కారణం చేత తరచూ మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకొంటుంటారు. ఇదివరకు ఒకసారి అయన కుమారుడు, అతని అనుచరులు కలిసి హైదరాబాద్ లోని ఒక మహిళ భర్తను చితకబాదినపుడు ఆ వార్తలు మీడియాలో వస్తే అప్పుడు తలసాని సంజాయిషీ చెప్పుకోవలసివచ్చింది. మళ్ళీ ఇవ్వాళ్ళ కూడా ఆయన తన కొడుకుకి సంబంధించి మీడియాలో వస్తున్న వార్తలపై సంజాయిషీ ఇచ్చుకోవలసి వచ్చింది.
ఏపిలోని అరకు ఎంపి కొత్తపల్లి గీత భర్త రామకోటేశ్వరరావు మంత్రిగారి కుమారుడు, అతని అనుచరులపై నిన్న బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. హైదరాబాద్ లో షేక్ పేటలోని ఒక స్థలం వివాదంలో వారు తనను బెదిరించి, బలవంతంగా కొన్ని కాగితాల మీద సంతకాలు చేయించుకొని, తనకు చెందిన కొన్ని విలువయిన పత్రాలను బలవంతంగా లాక్కొన్నారని, ఆ తరువాత నిన్న రాత్రి 12 గంటల వరకు తనను ఒక గదిలో నిర్భందించారని రామకోటేశ్వర రావు పోలీసులకు పిర్యాదు చేసారు. షేక్ పేట భూమి గురించి మాట్లాడుకొందామని రమ్మని పిలిచి తనను బెదిరించి కిడ్నాప్ చేసారని ఆయన పోలీసులకు పిర్యాదు చేసారు.
కనుక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇవ్వాళ్ళ ఉదయం హైదరాబాద్ లోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి దీనిపై వివరణ ఇచ్చుకొన్నారు. ఈ స్థలం వ్యవహారం గత రెండుమూడేళ్ళుగా సాగుతోందని, దానికి సంబంధించి రామకోటేశ్వరరావు తమకు చాలా పెద్ద మొత్తంలో డబ్బు బాకీ పడ్డాడని, కానీ ఇన్నేళ్ళవుతున్నా రేపుమాపు అని డబ్బు ఇవ్వకుండా తిప్పుతూ కాలక్షేపం చేస్తున్నాడని తలసాని చెప్పారు. అదే విషయం గురించి మళ్ళీ నిన్న అతను మాట్లాడుకొందామని చెప్పినప్పుడు తన కొడుకు, ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరో ముగ్గురు వ్యక్తులు ఆయనని తాజ్ కృష్ణ హోటల్లో బయట ఉన్న లాన్ లో కలిసి మాట్లాడుకొన్నారని తలసాని చెప్పారు.
ప్రస్తుతానికి ఒక ఐదు కోట్లు ఇస్తానని, మిగిలినది తిరిగి చెల్లించదానికి మరి కొంత సమయం పడుతుంది కనుక దాని కోసం తనకు చెందిన వేరే ఆస్తి తాలూకు పత్రాలను హామీగా ఉంచుతానని రామకోటేశ్వర రావు చెప్పగా, అందుకు తన కొడుకు, మిగిలిన ముగ్గురూ కూడా అంగీకరించడంతో, రామకోటేశ్వరరావు మళ్ళీ ఇంటికి వెళ్లి ఆ కాగితాలను తెచ్చి ఇచ్చి, తమ మధ్య జరిగిన ఈ కొత్త ఒప్పందం గురించి ఒక తెల్ల కాగితం మీద వ్రాసి సంతకం చేసి ఇచ్చేడని తలసాని చెప్పారు. ఆ తరువాత ఎవరి మానాన్న వారు వెళ్లిపోయారని చెప్పారు. కానీ రామకోటేశ్వరరావు తమ బాకీ చెల్లించకుండా ఎగవేయడానికి ప్రయత్నించడమే కాకుండా తిరిగి తన కొడుకు మీద లేని పోనీ అభాండాలు వేస్తూ పోలీసులకి పిర్యాదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇరువర్గాలు చెపుతున్న విషయాలు పూర్తి వ్యతిరేకంగా ఉండటంతో, పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.