రాష్ట్రాన్ని దేశాన్ని నడిపించాల్సిన రాజకీయ నేతలు, పార్టీలు కులాలు, మతాల లెక్కలు చూసుకొంటూ రాజకీయాలు చేస్తున్నప్పుడు, విశ్వవిద్యాలయాలలో వారి పార్టీలకి అనుబంధంగా పనిచేస్తున్న విద్యార్ధి సంఘాలు యధారాజ తధాప్రజా…అన్నట్లుగా వ్యవహరిస్తాయే తప్ప వారికి భిన్నంగా వ్యవహరిస్తాయని ఆశించడం అవివేకమే అవుతుంది. డిల్లీలోని జె.ఎన్.యు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలలో ఇటీవల జరిగిన పరిణామాలన్నీ రాజకీయ పార్టీల చలువే తప్ప విద్యార్ధుల ఆలోచన కాదని చెప్పవచ్చును. ఒకవేళ రాజకీయ పార్టీలు విశ్వవిద్యాలయాలలో విద్యార్ధులను తమ పార్టీలకి అనుబంధ సంఘాలను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించకపోతే, అసలు ఈ సమస్యలే తలెత్తేవి కావు. ఆ రెండు విశ్వవిద్యాలయాలలో రాజకీయ నేతలు చేయకూడనివన్నీ చేసిఅందరూ తప్పుకొన్నారు. ఇప్పుడు మధ్యలో విద్యార్దుల చదువులు, జీవితాలు పాడవుతున్నాయి.
ఈ పరిణామాలపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే సమయంలో ఇంచుమించు ఒకే విధంగా స్పందించడం విశేషం. ఇరువురూ కూడా విశ్వవిద్యాలయాలలో రాజకీయాలను, కులాలు, మతాల వారిగా విద్యార్ధులు పోరాడుకోవడాన్ని ఖండించారు. విశ్వవిద్యాలయాలలో విద్యార్ధులు కేవలం తమ చదువులకే పరిమితం కావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి విశ్వవిద్యాలయాలపై ఎటువంటి నియంత్రాణాదికారాలు లేకపోవడం వలననే ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి కనుక అందుకు అనుగుణంగా తగు చర్యలు చేపడతామని ష్తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ముఖ్యంగా హైదరాబాద్ యూనివర్సిటీలో పరిస్థితులను ప్రధాని నరేంద్ర మోడితో మాట్లాడి చక్కదిద్దుతానని శాసనసభకు హామీ ఇచ్చేరు. చంద్రబాబు నాయుడు కూడా విశ్వవిద్యాలయాలలో దిగజారుతున్న పరిస్థితులపై ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేసారు కానీవాటి పరిష్కారానికి తమ ప్రభుత్వం ఏమైనా చర్యలు చేపడుతుందా లేదా చెప్పలేదు. విశ్వవిద్యాలయాలలో ఇటువంటి పరిస్థితులు మారాలంటే రాజకీయ పార్టీలన్నీ వాటికి, విద్యార్ధులకు దూరంగా ఉండాలి. అలాగే విశ్వవిద్యాలయాల అధిపతులు, అధికారులు కూడా ఈ రాజకీయ పార్టీలకి, ప్రభుత్వానికి దూరంగా ఉంటూ కేవలం తమ విశ్వవిద్యాలయాల నిర్వహణ, ప్రమాణాలపైనే దృష్టి పెట్టి పనిచేయాల్సి ఉంటుంది. విద్యార్ధులు కూడా కుల,మత, రాజకీయాలకు దూరంగా ఉంటూ ఒక లక్ష్యంతో చదువుకోవాలి. అప్పుడే ఈ పరిస్థితులలో మార్పు ఆశించవచ్చును. కానీ అది ఎప్పటికయినా సాధ్యమేనా? అంటే దానికి సమాధానం వాళ్ళే చెప్పాలి.