తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు… గురువారం అసెంబ్లీలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం దిద్దబోతున్నారు. తెలంగాణలో కేసీఆర్ సర్కారు సిద్ధం చేస్తున్న సమగ్ర జలప్రణాళిక విధానాలు, ప్రాజెక్టుల రీడిజైనింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, దాని ఆవశ్యకత, ఇదివరకటి ప్రభుత్వాల పాలనకాలంలో నీటిపారుదల రంగం పరంగా తెలంగాణకు జరిగిన అన్యాయం, ఇప్పుడు ఇరుగు పొరుగు రాష్ట్రాలతో మంతనాల ద్వారా జరిగిన నష్టాన్ని చక్కదిద్దడానికి జరుగుతున్న ప్రయత్నం ఇలా అన్ని విషయాల గురించి ‘పవర్ పాయింట్ ప్రజంటేషన్’ ద్వారా సభలో సభ్యులందరికీ వివరించి చెప్పే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు. నిజానికి ఇది దేశంలోని అసెంబ్లీలో చరిత్రలోనే కొత్త అధ్యాయం. ఒక ముఖ్యమంత్రి స్వయంగా కంప్యూటర్ ఆపరేట్ చేస్తూ.. పవర్ పాయింట్ ద్వారా అసెంబ్లీలో సభ్యులకు ఒక అంశాన్ని వివరించడం, తర్వాత చర్చకు ఏర్పాటు చేయడం అనేది చరిత్రలో ఎన్నడూ లేని సంగతి. అయితే కేసీఆర్ మీద హైటెక్ అనే ముద్ర ఏదీ ఇప్పటిదాకా లేదు గానీ.. ఈ హైటెక్ విధానానికి ఆయన దేశంలోనే ఆద్యుడిగా శ్రీకారం చుడుతున్నారు.
అయితే ఈ ప్రజంటేషన్ విషయంలో విపక్షాలు మాత్రం వింత పోకడలకు పోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజంటేషన్‌కు వెళ్లరాదని ముందే నిర్ణయించింది. పవర్ పాయింట్ ప్రజంటేషన్ అనేది అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధం అని కాంగ్రెస్ వాదించడం విడ్డూరం. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్నప్పుడు దాన్ని వినియోగించుకుని, సభ్యులకు చెప్పదలచుకున్న అంశం గురించి ఒక అవగాహన కల్పించి, ఆ తర్వాత చర్చకు అవకాశం ఇవ్వడంలో వింతేముందో గానీ.. వారు మాత్రం తాము ప్రజంటేషన్‌కు రాము అని తెగేసి చెప్పేశారు.
అయితే ఇంకో ట్విస్టు ఏంటంటే.. మరో విపక్ష కూటమి అయిన మిత్రులు తెదేపా- భాజపాలు ఈ విషయంలో తొలుత ఏమీ తేల్చుకోలేకపోయాయి. గురువారం ఉదయం సమావేశం అయి.. విషయాన్ని చర్చించాయి. తెదేపాకు ఉన్న సభ్యులు ముగ్గురే అయినా.. వారు సభకు వెళ్లరాదని నిర్ణయించారు. అయితే భాజపా మాత్రం సభకు వెళ్లడానికే మొగ్గుచూపింది. అంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవ్వబోయే చారిత్రాత్మక ప్రజంటేషన్‌కు తెలంగాణ అసెంబ్లీలో పాలకపక్షం, వారి మిత్రపక్షం అయినా ఎంఐఎం కాకుండా.. భాజపా మాత్రమే హాజరవుతుందన్నమాట. దీనిని వ్యతిరేకించాలన్న తెదేపా వాదనకు భాజపా తూచ్ అనేసింది. ఇండైరక్టుగా కేసీఆర్ ప్రజంటేషన్‌కే భాజపా జై కొట్టినట్లు ఈ పరిణామం కనిపిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో తెదేపాతో బంధం యూజ్లెస్ అని అంతో ఇంతో గులాబీ దళానికి దగ్గర కావడానికి కాషాయవర్గం ప్రతి చాన్సును ఉపయోగించుకుంటున్నదని పుకార్లున్నాయి. తాజా పరిణామాలు కూడా దానికి నిదర్శనంగానే కనిపిస్తున్నాయి.