ప్రజలు చీదరించుకొన్నా పరువాలేదు…కాగ్ మొట్టి కాయలు వేస్తున్నా పట్టించుకోవు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి, కాంట్రాక్టు వర్కర్ల జీతాలు పెంచడానికి, వృద్ధులు, విలాంగులకు పెన్షన్లు చెల్లించడానికి, పంట రుణాలను మాఫీ చేయడానికి ప్రభుత్వాల వద్ద డబ్బులు లేకపోవచ్చును. చివరికి ప్రభుత్వోద్యోగుల జీతాలు చెల్లించడానికి కూడా డబ్బులు లేకపోవచ్చును. కానీ ఎమ్మెల్యేల జీతాలు పెంచడానికి ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు లేవు…ఉండవు కూడా.
రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నట్లుగా ఒకేసారి తమ తమ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు భారీగా జీతాలు పెంచేసాయి. ప్రజా సమస్యల పరిష్కారంలో రాజకీయ పార్టీలు వాటి ఎమ్మెల్యేలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తారేమో కానీ ఈ ఒక్క విషయంలో అందరూ తమ పార్టీ విభేదాలు, విద్వేషాలు, భేషజాలు, పంతాలు అన్నీ పక్కనపెట్టేసి ఏకగ్రీవంగా జీతాల పెంపు తీర్మానాలని ఆమోదింపజేసుకొంటారు. దానిని ముఖ్యమంత్రులు కూడా గట్టిగా సమర్ధించుకొంటారు. దీని గురించి మీడియాలో విమర్శలు చేయడం తగదని హితవు చెపుతారు. ప్రజాసేవ అంటే మాటలు కాదని అది చాలా ఖరీదయిన వ్యవహారమని కనుక వారి కష్టాలు వాళ్ళకి ఉంటాయని చెప్తారు. కనుక ఈ విషయంలో ఎవరూ వేలెత్తి చూపోద్దని అందరికీ కేసీఆర్ చాలా వినయంగా వార్నింగ్ ఇచ్చేసారు. ఇంక ప్రతీ మాటకి ముందొక “ఆర్ధిక ఇబ్బందులు” వెనుకొక “ఆర్ధిక ఇబ్బందులు” అనే పదాన్ని తగిలించి మాట్లాడే అలవాటున్న చంద్రబాబు నాయుడు మరొకడుగు ముందుకు వేసి ప్రజాప్రతినిధులు ఇంకా బాగా ప్రజా సేవచేయడానికి వీలుగా అందరికీ ఐ-ఫోన్లను అవేవో పల్లీలు, బటానీలు అన్నంత తేలికగా పంచిపెట్టేసారు. కనుక ఇకనుంచి ఎమ్మెల్యేలందరూ ఇంకా బాగా ప్రజాసేవ చేసేయవచ్చును.
గత రెండు వారాలుగా సాగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలలో వైకాపా అధ్యక్షుడు జగన్ చిట్టచివరి రోజువరకు కూడా నిత్యం చేసిన విమర్శ ఏమిటంటే తెదేపా ప్రభుత్వం విచ్చలవిడిగా ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తూ దుబారా చేస్తోందని. కాగ్ కూడా అదే చెప్పింది. కేంద్రం కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ప్రజలు కూడా అలాగే భావిస్తున్నారు. అయినా డోంట్ కేర్…అన్నట్లుగా ఎమ్మెల్యేలకు భారీగా జీతాలు పెంచేసింది. దానితో బాటు ఖరీదయిన బహుమానాలు కూడా పంచి పెట్టేసింది. కనుక ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉద్యోగుల ముందు కానీ, డిల్లీలో ప్రధాని నరేంద్ర మోడి, జైట్లీల ముందు గానీ “ఆర్ధిక ఇబ్బందులు” పాట పాడటానికి వీలులేదు. ఒకవేళ పాడినా ఎవరూ పట్టించుకొనే వారుండరు. పైగా ఈ జీతాల పెంపు, ‘ఐ-ఫోన్ల’ పంపిణీ గురించి ఎదురు ప్రశ్నించవచ్చును. ఇప్పుడు కేంద్రం చేతిలో కాగ్ నివేదిక కూడా ఉంది. కనుక ఇంక చంద్రబాబు నాయుడు డిల్లీ వెళ్ళవలసిన అవసరమే లేదు. వెళ్ళదలిస్తే ఏ సింగపూరో…జపానో వెళ్ళడం మంచిది. ఎందుకంటే వాళ్ళు ఇవ్వన్నీ పట్టించుకోకపోవచ్చును.