తెలంగాణ శాసనసభలో ఓ కొత్త దృశ్యం కనిపించింది. జల వనరులు, ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. తానే ఆపరేట్ చేస్తూ, గూగుల్ మ్యాప్ ఆధారంగా ప్రాజెక్టులు, ప్రతిపాదిత ప్రాజెక్టులు నిర్మించే ప్రదేశాలు, గతంలో జరిగిన విషయాలు, భవిష్యత్తులో జరగబోయే పనుల గురించి అనర్గళంగా వివరించారు. తనకు తెలిసిన విషయాన్ని శాసనసభ్యులకు, లైవ్ టెలికాస్ట్ ద్వారా యావన్మంది ప్రజలకు తెలియజెప్పాలనే కేసీఆర్ ఉద్దేశం మంచిదే. అయితే, చరిత్ర ఎక్కువైంది. నిజానికి ఇప్పుడు జనం కోరుకునే విషయాలకు సంబంధించిన వివరాలే తక్కువయ్యాయి.
ఇవాళ కేసీఆర్ చెప్పిన చరిత్ర తెలంగాణలో చాలా మందికి తెలిసిందే. తెలంగాణ ఉద్యమ సమయంలో నమస్తే తెలంగాణతో సహా ఇతర పత్రికలు, చానల్స్, మేధావుల ప్రసంగాలు, ఇతర మార్గాల ద్వారా ప్రజలు ఈ విషయాలను తెలుసుకున్నారు. అసలు ఉద్యమంలో పాల్గొనని వారు, ఉద్యమం అంటే తెలియని వారు, ఉద్యమాన్ని వ్యతిరేకించిన కొందరు ఏవో కారణాలతో కేసీఆర్ పుణ్యమా అని ఎమ్మెల్యేలయ్యారు. మంత్రులయ్యారు. బహుశా వాళ్లకు ఈ విషయాలు తెలియకపోవచ్చు. అలాంటి వాళ్లను మినహాయిస్తే, దాదాపు ప్రతి తెలంగాణ బిడ్డకూ ఈ విషయాలు చాలా వరకు తెలుసు. ఏవో ఒకటి రెండు విషయాలు మాత్రమే తెలియక పోవచ్చు.
ప్రాజెక్టుల డిజైన్ ను ఎందుకు మారుస్తున్నామో ప్రజలకు కన్విన్సింగ్ గా చెప్పడానికి కేసీఆర్ ప్రయత్నించారు. మహారాష్ట్రతో ఒప్పందం, దాని నేపథ్యం గురించి వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం గురించి చాలా వివరంగా చెప్పారు. ఇవన్నీ చాలా మందికి తెలిసిన విషయాలే. సగటు రైతుకు కావాల్సింది ఒక్కటే. సాగు నీరు ఎప్పుడు వస్తుంది. సగటు పౌరుడికి కావాల్సింది ఒక్కటే. తాగునీటి సదుపాయం లేని చోట నల్లాల్లో నీళ్లు ఎప్పుడు వస్తాయి. ఈ వివరాలపై ఉన్న ఆసక్తి, చరిత్రపై ఉండకపోవచ్చు. అయితే, కేసీఆర్ ప్రయత్నం ఎంతో కొంత అవగాహన కల్పించడానికి ఉపయోగపడింది.
ఇది సంప్రదాయం కాదనే కారణంతో కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. అసలు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకని ప్రెజెంటేషన్ ఇచ్చే కేసీఆర్ ఏం చెప్తారో వినడానికైనా వాళ్లు రావాల్సింది. కొత్త ఒరవడిని ఆహ్వానించే పాజిటివ్ లక్షణాలు కూడా రాజకీయ పార్టీలకు అవసరం. అయితే తమ బండారం బయటపడుతుందనే వాళ్లు డుమ్మా కొట్టారని తెరాస ఆరోపించడానికి అవకాశం ఇచ్చినట్టయింది. టీడీపీ కూడా కేసీఆర్ ఏం చెప్తారో విందామనే ఉద్దేశం లేకుండా దీన్ని బహిష్కరించింది. బీజేపీ మాత్రం కొత్త ఒరవడికి స్వాగతం పలికింది. ముఖ్యమంత్రి చెప్పేది వినే ఓపికైనా ఉండాలనే సంకేతాన్ని ఇచ్చింది. అయితే, మాటలు చెప్పడం వేరు. చేతల్లో చూపడం వేరు. సాగు తాగునీటి సమస్య పరిష్కారం చాలా పెద్ద విషయం. కేసీఆర్ మాటల్లో చెప్పిన చిత్తశుద్ధి చేతల్లో చూపి, సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తే అది బంగారు తెలంగాణకు బాటలు వేయడంలో దోహదపడుతుంది.