కేంద్ర మంత్రి సుజన చౌదరి ఈ ఆర్ధిక సంవత్సరం చివరి రోజయిన ఈరోజు ఒక మంచి కబురు చెప్పారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి వివిధ పద్దుల క్రింద రూ. 1800 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఆ డబ్బు ఈరోజు రాత్రిలోగా ఆంధ్రప్రదేశ్ ఖాతాలోకి బదిలీ అవుతాయని తెలిపారు. దానిలో రూ. పోలవరం ప్రాజెక్టు కోసం రూ.600 కోట్లు, రాజధాని నిర్మాణానికి రూ. 200 కోట్లు, రెవెన్యూ లోటు భర్తీకి రూ.1, 000 కోట్లు కేటాయించిందని ఆయన తెలిపారు. సెంట్రల్ టాక్సులో రాష్ట్ర వాటాగా రూ.650 కోట్లు మరొక వారం రోజులలోగా వస్తుందని మంత్రి సుజనా చౌదరి మీడియాకి తెలిపారు.
కేంద్రప్రభుత్వం బడ్జెట్ లో పోలవరానికి కేవలం రూ.100 కోట్లు మాత్రమే కేటాయించింది. అలాగే బడ్జెట్ లో రాజధాని నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. బడ్జెట్ లో ప్రత్యేకంగా తగినన్ని నిధులు కేటాయించకపోయినా తరువాత విడుదల చేస్తామని కేంద్రప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేస్తూ, రాష్ట్ర బడ్జెట్ లోనే పోలవరం నిర్మాణానికి రూ.3,660 కోట్లు, అమరావతి నిర్మాణానికి రూ.1,500 కోట్లు కేటాయించింది. అయితే నిధుల కోసం కేంద్రప్రభుత్వం నిరంతరం ఒత్తిడి చేయడం మాత్రం మానుకోలేదు. తత్ఫలితంగానే కేంద్రం పోలవరం కోసం అధనంగా మరో రూ.500 కోట్లు, రాజధాని కోసం రూ.200 కోట్లు మంజూరు చేసింది. రెవెన్యూ లోటు భర్తీకి కూడా భారీగా నిధులు విడుదల చేయడం హర్షణీయం.
అయితే కేంద్రప్రభుత్వాన్ని నిధుల కోసం ఒత్తిడి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వాటికి సరిగ్గా లెక్కలు చూపడం లేదని భాజపా నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పోలవరం కోసం కేంద్రం మంజూరు చేస్తున్న నిధులకు రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా లెక్కలు చూపడం లేదని పురందేశ్వరి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులను దుబారా చేస్తోందని కాగ్ కూడా మొట్టికాయలు వేసింది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలకు భారీగా జీత భత్యాలు పెంచేసి, మళ్ళీ అందరికీ చాలా ఖరీదయిన ఐ-ఫోన్లను బహుమతిగా ఇచ్చింది. కనుక కేంద్రప్రభుత్వం ఎంత నిధులు విడుదల చేస్తున్న వాటిని రాష్ట్ర ప్రభుత్వం సవ్యంగా, పొదుపుగా ఖర్చు చేస్తున్నప్పుడే ప్రయోజనం ఉంటుంది. లేకుంటే కేంద్రప్రభుత్వం కూడా ఇంకా ఎంత ఒత్తిడి చేసిన ఇక ముందు నిధులు విడుదల చేయకపోవచ్చును. అదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వమే ఇబ్బందులు పడవలసిఉంటుంది. పైగా దాని వలన తెదేపా-భాజపాల స్నేహ సంబంధాలు కూడా దెబ్బ తినే అవకాశం ఉంటుంది.