తన పార్టీ గుర్తు మీద గెలిచి, తదనంతర పరిణామాల్లో తెలుగుదేశంలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్కు పీకలదాకా ఆగ్రహం ఉండడం సహజం. అయితే దానిని ఆయన ప్రతి సందర్భంలోనూ ప్రదర్శిస్తున్నారు. అసలు ఆ పది మంది గురించి మాట్లాడడమే అనవసరం అంటూ అసహ్యించుకుంటున్నారు. వారితో రాజీనామాలు చేయించి మళ్లీ ఎన్నికలకు సిద్ధంకండి అంటూ సవాళ్లు విసురుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా శాసనసభా పర్వం ముగిసిన తర్వాత.. పెట్టిన ప్రెస్మీట్లో.. ”వారిని మళ్లీ ఎన్నికలకు దింపండి.. తెలుగుదేశం ప్రభుత్వం ఈ రెండేళ్లలో చేసిన పాలన ప్రభావంగా ఓట్లు వస్తాయే తప్ప.. మీరు కొనుక్కున్న ఎమ్మెల్యేల వల్ల ఓట్లేమీ రావు” అంటూ జగన్ వ్యాఖ్యానించారు.
అయితే జగన్ తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో గానీ.. ఆయన మాటలు ఆయన సొంత పార్టీలో మిగిలి ఉన్న ఎమ్మెల్యేలను కించపరిచే విధంగా ఉంటున్నాయనే వాదన పార్టీలో వినిపిస్తోంది. జగన్ మాటలు పరోక్షంగా.. తన పార్టీలో ఉన్న ఏ ఎమ్మెల్యేకు కూడా సొంతంగా నాలుగు ఓట్లు తెచ్చుకోగల సత్తా లేదు… ఉన్న అందరు ఎమ్మెల్యేలు సాధించుకున్న అన్ని ఓట్లు తనను చూసి మాత్రమే వచ్చాయి అంటున్నట్లుగా ఉన్నదని పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో తమతమ నియోజకవర్గాల్లో పార్టీ హవాకు తోడుగా తమకంటూ సొంత కరిష్మా కలిగి ఉన్న నాయకులు కూడా కొందరు ఉన్నారు. వారి సొంత ఇమేజికి పార్టీ బలం కాస్త తోడయి ఉండవచ్చు. అలాంటి పార్టీ మద్దతు వారు ఏ పార్టీలో ఉన్నా లభిస్తుంది. అలాంటి నేపథ్యంలో అందరినీ ఒకే గాటన కట్టేస్తున్నట్లుగా.. పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే కేవలం తన పుణ్యాన గెలిచారన్నట్లుగా జనం వారి మొహం చూసి ఓట్లు వేయడం జరగదు అంటూ జగన్ మాట్లాడడం కరెక్టు కాదని వైకాపా ఎమ్మెల్యేలు కొందరిలో అసంతృప్తి రేగుతోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద అధినేత ఆగ్రహం కక్కడం కరెక్టే గానీ.. ఆ డైలాగులు పార్టీలో మిగిలి ఉన్న ఎమ్మెల్యేలను కూడా కించపరిచేలా ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి కదా అనుకుంటున్నారు.