సాధ్యం కాదని తెలిసున్నప్పటికీ, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ తెదేపాకి చెందిన ఎవరినో ఒకరి రాజీనామాకు పట్టుబడుతుంటారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా మంజూరు చేయడం లేదు కనుక అందుకు నిరసన తెలుపుతూ తెదేపాకి చెందిన ఇద్దరు కేంద్రమంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. దానికి తెదేపాయే కాదు భాజపా నేతలు కూడా చాలా ఘాటుగా జవాబిచ్చినా జగన్ తన ఆ పాట పాడటం మానుకోలేదు. అవకాశం వచ్చినప్పుడల్లా మళ్ళీ మళ్ళీ అదే పాత పాట పాడుకొంటూ తృప్తి పడుతున్నారు. ఆయనకు అదో తుత్తి అనిసరిపెట్టుకోవాలేమో?
ఓటుకి నోటు కేసులో, ఆ తరువాత గోదావరి పుష్కరాలలో కొంతమంది యాత్రికులు త్రొక్కిసలాటలో చనిపోయినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. కానీ చంద్రబాబు నాయుడు ఆయన కోరిక నెరవేర్చలేదు. తాజాగా వైకాపా నుంచి తెదేపాలోకి దూకేసిన 10 మంది ఎమ్మెల్యేల రాజీనామాల కోసం జగన్మోహన్ రెడ్డి పట్టుబడుతున్నారు కానీ ఆ ‘చిరు కోరిక’ కూడా నెరవేరే అవకాశం లేదని స్పష్టం అయ్యింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న తన పార్టీ ప్రజా ప్రతినిధులతో సమావేశంలో ‘తెదేపా గేట్లు ఎత్తేద్దామని’ ప్రతిపాదించారు. అంటే మున్ముందు జగన్మోహన్ రెడ్డి ఇంకా చాలా మంది రాజీనామాల కోసం మాట్లాడవలసి ఉంటుందని అర్ధం అవుతోంది. ఇంతవరకు బాగానే ఉంది కానీ పార్టీ విడిచిపెట్టి బయటకి పోయేవారి గురించి జగన్మోహన్ రెడ్డి చులకనగా మాట్లాడుతున్న మాటలను విని పార్టీలో ఉన్నవారు కూడా బాగా ‘హర్ట్’ అయిపోయే ప్రమాదం ఉంది.
జనాలు తన మొహం చూసే వాళ్ళకి ఓట్లు వేశారు తప్ప వారి స్వంత బలం చూసి కాదన్నట్లుగా జగన్ మాట్లాడుతున్నారు. తమ అధినేత మనసులో తమపై ఇంతటి చులకన భావం ఉందని గ్రహించిన తరువాత ఇంకా వైకాపాలో కొనసాగడం చాలా కష్టమనిపిస్తే అందులో ఆశ్చర్యమేమీ లేదు. ఎలాగూ చంద్రబాబు నాయుడు ‘ద్వారము తెరిచియే ఉంచుతామని’ చెప్పుతున్నారు కనుక ఇప్పుడే లోపలకి వెళ్ళిపోవడం బెటర్ అని వైకాపాలో (మిగిలి) ఉన్న ఎమ్మెల్యేలు అనుకొన్నా ఆశ్చర్యం లేదు.
నిజానికి తెదేపాయే మొదట వైకాపా ఎమ్మెల్యేలను ఫిరాయింపులకి ప్రోత్సహించినప్పటికీ, జగన్ ప్రదర్శిస్తున్న ఈ వైఖరి వలన దానికి ఆ శ్రమ కూడా తప్పింది. ఇప్పుడు తెదేపా వైకాపా ఎమ్మెల్యేలకి ఎటువంటి ఆఫర్లు ఇవ్వకపోయినా వారంతట వారే తెదేపాలోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి.
మొన్న శాసనసభలో మంత్రి అచ్చెం నాయుడు కూడా ఇదే చెప్పారు. మేమేమీ మీ పార్టీ ఎమ్మెల్యేలను ప్రోత్సహించనక్కర లేదు. మీ (జగన్) వైఖరి చూసి వాళ్ళంతట వాళ్ళే తెదేపాలోకి వచ్చేస్తారు. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డే స్వయంగా తన ఎమ్మెల్యేలని మా పార్టీలోకి పంపిస్తున్నారు. ఆయనే స్వయంగా తన ఎమ్మెల్యేలని మా పార్టీలోకి పంపిస్తుంటే వాళ్ళని మేము ఎందుకు వద్ధాంటాము? అని ప్రశ్నించారు. నిజమే కదా?