ఎందుకో తెలీదు గానీ.. రాంగోపాల్ వర్మ అంటే ఓ రకమైన పిచ్చి ఇష్టం తెలుగు సినీ ప్రియులకు. వర్మ నుంచి సడన్‌గా ఓ అద్భుతం రాకుండా పోతుందా..? అన్న నమ్మకం వాళ్లది. మధ్య మధ్యలో ఎన్ని పిచ్చి సినిమాలు తీసినా.. వర్మని భరించేది, సహించేది అందుకే. మొన్నటికి మొన్న కిల్లింగ్ వీరప్పన్ అంటూ.. ఓ రియలిస్టిక్ కథని మరింత రియలిస్టిక్‌గా తెరపై ఆవిష్కరించాడు. అలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు వర్మలోని ప్రతిభ ఇంకా చచ్చిపోలేదు అనిపిస్తుంది. అందుకే.. వర్మ నుంచి మరో సినిమా వస్తోందంటే ఎక్కడ లేని అటెన్షన్ మొదలైపోతుంది. ఎటాక్ సినిమానీ జనాలు అలానే నమ్మారు. ట్రైలర్ కూడా డీసెంట్‌గానే ఉండడంతో వర్మ అద్భుతం చేస్తాడేమో అని ఆశపడ్డారు. మరి.. ఆ ఆశ నెరవేరిందా? ఎటాక్ ఎలా ఉంది? ఎవరికి నచ్చుతుంది? వర్మ ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకొన్నాడు? తెలియాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే.
* కథ:
తప్పు చేసిన వారిని క్షమించడం మహాపాపం.. అంటూ మహాభారతంలో చెప్పిన మాట చుట్టూ అల్లుకొన్న కథ ఇది. గురు (ప్రకాష్ రాజ్) ది థూల్ పేట్. అక్కడ ఒకప్పుడు సీరియస్‌గా దందాలు సాగించాడు. పెళ్లాం, పిల్లలకోసం వాటిని వదిలేసి ఓ కొత్త జీవితం గడుపుతాడు. పెద్ద కొడుకు కాళి (జగపతిబాబు)కి ఆవేశం ఎక్కువ. రెండోవాడు గోపి (వడ్డేనవీన్) పిరికివాడు. మూడో కొడుకు రాధ (మనోజ్) ఇలాంటి గొడవలకు. దందాలకూ దూరంగా తన వ్యాపారాలు ఏవో చూసుకొంటుంటాడు. అలాంటి సమయంలోనే గురుని ఎవరో హత్య చేస్తారు. ఆహత్యకూ సత్తూ (అభిమన్యుసింగ్) అనే రౌడీ షీటర్‌కీ సంబంధం ఏమిటి? అసలు దందాలకు దూరంగా ఉన్న గురుని ఎందుకు చంపాల్సివచ్చింది? తండ్రి చనిపోతే ఏ కొడుకు ఎలా స్పందించాడు? ఎవరు ప్రతీకారం తీర్చుకొన్నారు? అనేదే.. ఎటాక్ సినిమా.
* విశ్లేషణ
కథలో ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేదు. చాలా సూటిగా, సుత్తి లేకుండా వర్మ అల్లుకొన్న కథ ఇది. థూల్ పేట వ్యవహారాలపై వర్మ ఈసారి ఎక్కువగా ఫోకస్ చేశాడు. సినిమా అంతా ఆ ఏరియాలోనే సాగుతుంది. కథకు అనుగుణంగా నిజంగానే థూల్ పేటలో చిత్రీకరణ జరిపాడు వర్మ. గురుని ప్రత్యర్థులు చంపడంతో కథ మొదలవుతుంది. ఆ తరవాత గురు కుటుంబంపై, సన్నిహితులపై వరుసగా ఎటాక్‌లు జరుగుతుంటాయి. ప్రతిగా గురు కుటుంబం కూడా ప్రతీకార చర్యకు పాల్పడుతుంది. ఇదంతా చూస్తుంటే.. ఈటీవీలో వచ్చే నేరాలూ, ఘోరాలు ఎపిసోడ్‌ని వెండి తెరపై చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఎటాక్‌లు, వార్నింగ్‌లు తప్ప.. సినిమాలో మరేం కనిపించవు. టేటింగ్‌లోనూ వర్మ… గొప్పగా చూపించిందేం లేదు. ఫ్లై కెమెరాల్ని ఒకటికి పదిసార్లు వాడి ఏరియల్ షాట్స్ బాగా తీశాడంతే. ప్రతీ పాత్ర చాలా సీరియస్‌గా కనిపిస్తుంటుంది. ప్రకాష్‌రాజ్ తొలి సీన్‌లోనే చనిపోయాడు గానీ.. ఈ సినిమాలో ఏ పాత్రకు గురు గుర్తొచ్చినా.. తెరపై వాలిపోయి డైలాగులు వల్లిస్తుంటాడు. ఈ స్ర్కీన్ ప్లే ప్రేక్షకుల్ని కాస్త చికాకు పెట్టేదే. పూనమ్ కౌర్ ని మరీ ఇంత హార్డ్‌గా చూపించొచ్చా అనిపిస్తుంది.
హింసనీ, రొమాన్స్‌నీ మిక్స్ చేసిన సీన్స్ ఈ సినిమాలో కొన్నున్నాయి. విలన్ అభిమన్యుసింగ్ మర్డర్ ప్లాన్ వేసినా, చేసినా.. వెంటనే పక్కనున్న తన గాళ్ ఫ్రెండ్‌కి కామంగా వాటేసుకొంటుంటాడు. ఇలాంటి సన్నివేశాల్ని ఊహించడం, దాన్ని తెరపై తీసుకురావడం వర్మకే సాధ్యం అనుకోవాలి. సురభి చేసిందేం లేదు. ప్రతీసారీ మనోజ్ ముందు నిలబడి క్లాస్ పీకుతూ ఉంటుంది. బీరువాలో చూసిన సురభి తనేనా అనిపిస్తుంది. సినిమా అంతా పక్కా ‘రా’గా సాగుతుంది. రిలాక్సేషన్, వినోదం.. ఇవేం ఆశించకూడదు. నేపథ్య సంగీతం కూడా `ఎటాక్.. ఎటాక్.. ఎటాక్.. ఎటాక్` అంటూ ప్రేక్షకులపై అటాక్ చేస్తుంటుంది. ఈ సినిమాలో మామూలు కమర్షియల్ సినిమాల్లోలానే ఓ ట్విస్టు కూడా ఉంది. కాకపోతే.. ఆ ట్విస్టు రెండో సీన్‌లోనే ప్రేక్షకుడు ఊహిస్తాడన్న సంగతి… వర్మ ఊహించకపోవడం మన బ్యాడ్‌లక్. కథానాయకుడు తన ప్రతీకారాన్ని తీర్చుకోవడం కూడా మొక్కుబడి తంతుగా మార్చేశాడు వర్మ. దాంతో ఆ ఎమోషన్ కూడా ఆడియన్‌కి అందకుండా చేశాడు.
* నటీనటుల ప్రతిభ
వర్మ సినిమాలో ఎవరు కనిపించినా చాలా సహజంగా నటిస్తారు. ఈసినిమాలోనూ అదే జరిగింది. మనోజ్, జగపతి వీళ్లంతా నేచురల్‌గానే చేశారు. అయితే ప్రకాష్ రాజ్ నటన, డైలాగులు మాత్రం చాలా కృత్రిమంగా సాగాయి. అభిమన్యు సింగ్ గురించి ఇక చెప్పక్కర్లెద్దు. వడ్డే నవీన్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకొన్నాడేమో..? ఆ డబ్బింగ్ మరీ ఘోరంగా ఉంది. పూనమ్ ఇలాంటి పాత్ర ఎందుకు ఒప్పుకొందో అర్థం కాదు. సురభికి ఈ సినిమా వల్ల ఒరిగిందేం ఉండదు.
* సాంకేతికంగా…
అంజి కెమెరా వర్క్ ఓకే అనిపిస్తుందంతే. మరీ అంత గొప్పగా ఏం లేదు. 5డీ కెమెరాతో తీసిన సినిమా అని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. రవి శంకర్ నేపథ్య సంగీతంతో బెదరగొట్టాడు. మొత్తానికి దర్శకుడుగా, కథకుడిగా వర్మ మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. విషయంలేని ఓ పగ ప్రతీకారాల స్టోరీని, తనదైన పద్ధతిలో తీద్దామనుకొని భంగపడ్డాడు.
* పంచ్ లైన్:
ఎటాక్.. హుష్ పటాక్…
తెలుగు360.కామ్ రేటింగ్: 2/5