వైకాపా ఎమ్మెల్యేలు మరియు తోడళ్ళు కూడా అయిన జ్యోతుల నెహ్రూ, వరుపులు సుబ్బారావు తెదేపాలో చేరికకి ముహూర్తాలు ఖరారు చేసుకొన్నారు. ఆ విషయాన్నీ వారు కాకుండా ఆర్దిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించడం విశేషం. ఈనెల 8వ తేదీన సుబ్బారావు, 11వ తేదీన నెహ్రూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెదేపాలో చేరబోతున్నట్లు యనమల ప్రకటించారు. తెదేపాలో చేరడానికి అసలు కారణాలేమిటో అందరికీ తెలుసు అలాగే వారు చెప్పబోయే కారణాలు కూడా అందరికీ తెలుసు కనుక మళ్ళీ వాటి గురించి ముచ్చటించుకోవడం అనవసరం.
ఈ ఏప్రిల్ నెలలో తెదేపా టార్గెట్ మొత్తం 10 మంది వైకాపా ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆకర్షించడమని అనధికార సమాచారం. అంటే త్వరలోనే మరి కొందరి పేర్లు వినే అవకాశం ఉందన్నమాట. రంపచోడవరం ఎమ్మెల్యే వి.రాజేశ్వరి కూడా తెదేపాలో చేరుతారని మీడియాలో వార్తలు వచ్చేయి. ఆమె కూడా వాటిని దృవీకరిస్తున్నట్లు తెదేపా తనకు రూ.20 కోట్లు ఆఫర్ ఇచ్చిందని కానీ తెదేపాలో చేరేది లేదని చెప్పారు. ఆమె చెప్పినదానిని బట్టి తెదేపా ప్రస్తుతం ఆమెతో కూడా టచ్చులో ఉన్నట్లు అర్ధమవుతోంది. వైకాపాలో ఇంకా ఎవరెవరు ఈ క్యూలో ఉన్నారో త్వరలోనే తెలియవచ్చును.