నేటి నుంచి బిహార్ లో తొలి దశ మద్యపాన నిషేధం అమలులోకి వచ్చింది. స్థానికంగా తయారు చేసే దేశీ మద్యంతో బాటు దేశీయంగా తయారు చేసే విదేశీ మద్యం కూడా నిషేదించబడింది. అయితే స్టార్ హోటల్స్ కి మాత్రం ఈ మద్యనిషేధం వర్తించదు. నగరాలు, పట్టణాలలో ప్రభుత్వ అధీనంలో నడిచే దుఖాణాలలో దేశీయ విదేశీమద్యం పరిమితంగా అమ్మబడుతుంది. ఆ తరువాత క్రమంగా అవి కూడా మూసివేస్తారు. రాష్ట్రంలో దశలవారిగా మద్యనిషేధం అమలుచేయాలని కృత నిశ్చయంతో ఉన్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్, దాని కోసం శాసనసభలో బిల్లు కూడా ఆమోదింపజేశారు.
దేశంలో చాలా రాష్ట్రాలకు మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయమే ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తోంది. అందుకే అనేక రాష్ట్రాలు అసలు అటువంటి ఆలోచనే చేయడం లేదు. బిహార్ రాష్ట్రం కూడా దీనికి మినహాయింపు కాదు. 2007-08 సం.లలో బిహార్ ప్రభుత్వానికి మద్యంపై రూ. 525 కోట్లు ఆదాయం పొందగా, 2013-14 సం.లకి అది ఏకంగా రూ. 3560 కోట్లు అయ్యింది. అది ఈ ఏడాదికి మరింత పెరిగి ఉండవచ్చును. అంత భారీ ఆదాయాన్ని నితీష్ కుమార్ వద్దనుకొని రాష్ట్రంలో దశలవారిగా మద్యనిషేధం అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధిపదంలో నడిపించాలని చాలా పట్టుదలగా ఉన్నారు. మద్యనిషేధం ప్రకటన చేయడం తేలికే కానీ దానిని శాస్వితంగా అమలుచేయడం చాలా కష్టం. ఒకవేళ నితీష్ కుమార్ ఈ విషయంలో సఫలమయితే, రాష్ట్ర ఆర్ధిక, సామాజిక పరిస్థితులలో మెల్లగా మంచి మార్పులు వస్తాయి.