‘నేను పూర్తిగా విజయవాడకు షిఫ్ట్ అయిపోయా? ఆచరణలో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ.. ప్రజలకోసం పూర్తిగా ఇక్కడినుంచే పాలన నడిపిస్తున్నా.. ఉద్యోగులు అందరూ కూడా జూన్ 2 నాటికి పూర్తిస్థాయిలో ఇక్కడకు వచ్చేయాల్సిందే’ అంటూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎన్ని సందర్భాల్లో తన త్యాగనిరతి గురించి వల్లించి ఉంటారో లెక్కలేదు. సర్వహంగులతో కూడిన క్యాంప్ కార్యాలయం ఆయనకు బెజవాడలో ఉంది. ఆయన ఎక్కువ రోజులు అక్కడే గడుపుతున్నారు. ఏదైనా ప్రత్యేకంగా పనిఉంటే తప్ప.. హైదరాబాదులో కాలు కూడా పెట్టడం లేదు. తెలంగాణ పార్టీ సమీక్ష సమావేశాలను కూడా బెజవాడలోనే నిర్వహిస్తున్నారు. అంతగా బెజవాడ నివాసానికి అంకితం అయిపోయి.. ఆయన ఏపీ ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
అదే సమయంలో సరిగ్గా రెండు నెలల వ్యవధిలో ఏపీకి సంబంధించి హైదరాబాదులో ఉన్న కార్యాలయాలు అన్నీ అమరావతికి తరలిపోయే అవకాశం కూడా ఉంది. కేవలం రెండు నెలల వ్యవధి మాత్రమే ఉంది. అక్కడి కార్యాలయాలు ఒక కొలిక్కి రాగానే.. కార్యాలయాలు వెళ్లిపోతాయి. ఉద్యోగులు కూడా తమ తమ వెసులుబాటును బట్టి కుటుంబాలను వెంటబెట్టుకుని అమరావతికి వెళ్లిపోవచ్చు.
ఇదంతా చక్కగానే ఉంది. కానీ ఏపీ సీఎం వ్యవహారాలు అన్నీ ఏపీ గడ్డ మీదికే పూర్తిస్థాయిలో మారిపోతున్న ప్రస్తుత తరుణంలో ఇంకా హైదరాబాదులోని తన చిన్నిల్లుకు ఏపీ సర్కారు ఖాతాలో ఖర్చుపెట్టి అదనపు హంగులు సమకూర్చుకోవడానికి చంద్రబాబునాయుడు ప్రయత్నించడం అనేది విమర్శలను కొనితెచ్చుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. హైదరాబాదు మదీనగూడలో ఉన్న ఫాంహౌస్‌లో సీఎం స్థాయి భద్రత ఏర్పాట్లు మరియు హెలిపాడ్ ల దగ్గరినుంచి చివరికి సదరు ఫాంహౌస్‌లో బోరు వేసి వాటర్పైపులైన్లు ఏర్పాటు చేయడానికి, పోలీసు పికెట్లు తదితర ఏర్పాట్లకు 1.36 కోట్ల రూపాయలను ఏపీ సర్కారు విడుదల చేయడం ఇప్పుడు వివాదం అవుతోంది. చంద్రబాబునాయుడు ఒకవైపు ప్రజలను కరెంటు వాడకుండా పొదుపు చేయమంటారు.. ఒక్కొక్క రూపాయి ముడుపు కట్టి అమరావతి నిర్మాణానికి దఖలు చేయమంటారు.. అలాంటిది మరోవైపు ఇలా తన క్యాంపు ఆఫీసు పేరుతో తలచినచోటల్లా కోట్ల రూపాయల ప్రజాధనం తగలేయడం ఏం అనిపించుకుంటుంది? గతంలో సీఎం కాగానే జూబ్లీహిల్స్ ఇంటిని క్యాంప్ ఆఫీసుగా ప్రకటించి అప్పట్లో కోట్లరూపాయలు ఖర్చుచేసి ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మళ్లీ.. తన ఫాంహౌస్‌ను క్యాంప్ఆఫీసుగా ప్రకటించి 1.36 కోట్లు తగలేస్తున్నారు. మరోవైపు రాజధాని రెండు నెలల్లో పూర్తిస్థాయిలో బెజవాడకు వెళ్లిపోతున్నదనే ప్రచారమూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో నిధుల వృథాను జనం హర్షిస్తారా? చంద్రబాబు ఆలోచించుకోవాల్సి ఉంది.