త్వరలో అసోం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. వాటిల్లో ఏ పార్టీ గెలుస్తుందో తెలుసుకోవాలని ప్రజలు ఆసక్తి చూపడం సహజం. కనుక సర్వే సంస్థలు రంగంలోకి దిగి సర్వేలు ఫలితాలు వెల్లడించడం మొదలుపెట్టాయి. వాటిలో మొట్ట మొదటగా ప్రముఖ న్యూస్ ఛానల్ ‘టైమ్స్ నౌ’ సర్వే నిర్వహించి ఫలితాలు వెల్లడించింది. దాని ప్రకారం పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలలో ప్రస్తుతం అధికారంలో ఉన్న మమతా బెనర్జీ, జయలలిత ఇద్దరూ మళ్ళీ అధికారంలోకి వస్తారు. అసోంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి భాజపా నుంచి గట్టి పోటీ ఎదుర్కోబోతోంది. అక్కడ ఆ రెండు పార్టీలలో దేనికీ మెజారిటీ రాకపోవచ్చును. కనుక ‘హంగ్ అసెంబ్లీ’ ఏర్పడవచ్చును. కేరళలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యు.డి.ఎఫ్.కూటమి వామపక్ష కూటమి చేతిలో ఓడిపోయే అవకాశాలున్నాయి. పుదుచ్చేరిలో మాత్రం కాంగ్రెస్-డి.ఎం.కె కూటమి విజయం సాధించే అవకాశాలున్నాయి. ఇదీ క్లుప్తంగా టైమ్స్ నౌ సంస్థ ప్రకటించిన సర్వే ఫలితాలు.
అంటే నాలుగు రాష్ట్రాలలో ఎక్కడా కూడా భాజపా గెలిచే అవకాశం లేదన్నమాట. ఇది ముందు నుంచి ఊహిస్తున్నదే. అయితే దక్షిణాది రాష్ట్రాలలో భాజపా తన ప్రభావం చూపలేకపోయినప్పటికీ కాంగ్రెస్ అధీనంలో ఉన్న ఈశాన్య రాష్ట్రాలనయినా చేజిక్కించుకోవాలని అది చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది కనుక ఈ ఎన్నికలలో అసోంలో తిరుగులేని మెజారిటీతో గెలిచి ఉంటే దాని ఆకాంక్ష నెరవేరి ఉండేది. కానీ అదీ సాధ్యపడకపోవచ్చని సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి.
ఇంకా సర్వే ఫలితాలలో గణాంకాలు చూసినట్లయితే:
అసోం: (మొత్తం సీట్లు:126) అధికార కాంగ్రెస్ పార్టీ-53, భాజపా-55, ఏ.యు.ఎఫ్ కూటమి-12 సీట్లు రావచ్చును.
పశ్చిమ బెంగాల్: (మొత్తం సీట్లు:294)అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ-160 సీట్లు, సిపిఎం-106, భాజపా-4, ఇండిపెండెంట్లు-3 సీట్లు గెలుచుకోవచ్చని సర్వే ఫలితాలు చెపుతున్నాయి.
తమిళనాడు: (మొత్తం సీట్లు:235)అధికార అన్నాడిఎంకె-130, డిఎంకె-70, డిఎండికె- 14, భాజపా-2 లేక 3సీట్లు రావచ్చును.
పుదుచ్చేరి: (మొత్తం సీట్లు:30) కాంగ్రెస్ పార్టీ-డిఎంకె కూటమి-17, అధికార ఏ.ఐ.ఎన్.ఆర్.పార్టీ-7 సీట్లు రావచ్చును.