వైకాపా ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తెదేపా వలసలను ప్రోత్సహిస్తునందుకు ఆ పార్టీ తెదేపాపై విరుచుకు పడుతుంటే, జగన్ తీరుతో విసుగెత్తిపోయినవారు, చంద్రబాబు నాయుడు చేస్తున్న రాష్ట్రాభివృద్ధి చూసి నచ్చినవాళ్ళే మా పార్టీలో చేరుతున్నారని తెదేపా సమర్ధించుకొంటోంది. అయితే దీనిలో నిజానిజాలేమిటో ఆ రెండు పార్టీలకి, ప్రజలకీ తెలుసు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలనుకొంటున్నట్లు మొన్ననే చంద్రబాబు నాయుడు ప్రకటించేశారు కనుక తెదేపా తన ‘ఆపరేషన్ ఆకర్ష’ని ఇక ముందు కూడా కొనసాగించబోతోందని స్పష్టమయింది.
అది అనైతికం, అప్రజాస్వామిక ఆలోచన అని అందరికీ తెలుసు కానీ ఎవరూ ఏమి చేయలేని నిస్సహాయత. అయితే తెదేపా అమలుచేస్తున్న ఈ వ్యూహానికి తగిన ప్రతి వ్యూహంతో తెదేపాను ఎదుర్కోవలసిన వైకాపా కూడా నిస్సహాయంగా ఆక్రోశిస్తోంది. తెదేపాని ఏవిధంగా అడ్డుకోవాలో ఆలోచించకుండా, జగన్ తో సహా ఆ పార్టీ నేతలందరూ అన్యాయం…అక్రమం..అవినీతి…అప్రజాస్వామికం..అంటూ కోరస్ పాడుతూ కాలక్షేపం చేస్తున్నారు. ఆ పాట విని ప్రజలు వైకాపాపై సానుభూతి కురిపించవచ్చునేమో కానీ దానితో పార్టీని కాపాడుకోవడం సాధ్యం కాదని వైకాపా గ్రహిస్తున్నట్లు లేదు. పార్టీయే లేకుండాపోయినట్లయితే ఇంక ప్రజల సానుభూతి వలన ఏమి ప్రయోజనం ఉంటుంది?
ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీలో గట్టిగా మాట్లాడగలిగిన వారందరూ వరుసగా మీడియా ముందుకు వచ్చి తెదేపా తీరును గట్టిగానే ఖండిస్తున్నారు. దానికి తెదేపా నేతలు కూడా గట్టిగానే బదులిస్తూ వలసలను సమర్ధించుకోవడాన్ని వైకాపా కూడా చూస్తూనే ఉంది. ఈ వాదోపవాదాల వలన పార్టీకి జరుగుతున్న నష్టాన్ని ఏమాత్రం ఆపలేమని గ్రహించినప్పుడు, తక్షణమే వేరే ఉపాయాలు అలోచించి అమలుచేసి ఉండాలి కానీ తెదేపాను ఎంత గట్టిగా నిందిస్తే వైకాపాకి అంత నష్టం తగ్గుతుందన్నట్లుగా ఉంది వైకాపా నేతల తీరు. ఇప్పటికయినా జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నేతలు మేల్కొని తగిన ప్రతి వ్యూహం అమలుచేయలేకపోతే చివరికి వైకాపాయే తీవ్రంగా నష్టపోతుంది.