బిహార్ శాసనసభ ఎన్నికలలో గెలిచేందుకు బద్ధ విరోదులయిన లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ చేతులు కలిపినపుడు, వారు కనీసం ఎన్నికలు పూర్తయ్యేవరకయినా కలిసుంటారా? అని అందరూ అనుమానాలు వ్యక్తం చేసారు కానీ, వాళ్ళు నేటికీ చక్కగా కలిసే పనిచేసుకొనిపోతున్నాయి. ఆ ఆనుమానాలు వ్యక్తం చేసిన భాజపా, దాని మిత్రపక్షాలు మాత్రం కలిసుండలేకపోతున్నారు. వారి కూటమి అధికారంలో ఉండి ఉంటే ఇటువంటి చిన్నచిన్న గొడవలు సహజం అని సరిబెట్టుకోవచ్చును కానీ ప్రతిపక్ష బెంచీలలో కూర్చొని నితీష్ కుమార్ ప్రభుత్వంతో యుద్ధం చేయడంమాని వాళ్ళలో వాళ్ళే కత్తులు దూసుకొంటున్నారు.
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంజీ నేతృత్వంలోని హిందూస్తాన్ అవామీ మార్చ్ (సెక్యులర్), కేంద్ర మంత్రి రామ్ విలాష్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ, కేంద్రసహాయ మంత్రి ఉపేంద్ర కుషువా నేతృత్వంలోని ఆర్.ఎల్.ఎస్.పి.లు బీహార్ లో భాజపాకి మిత్రపక్షాలుగా ఉన్నాయి. వాటిలో ఇప్పుడు లుకలుకలు మొదలయ్యాయి.
భాజపా తమతో వ్యవహరిస్తున్న తీరుపట్ల జితన్ రామ్ మంజీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, “కూటమిలో మా మూడు పార్టీలకు భాజపా అసలు సముచిత గౌరవం ఇవ్వడం లేదు. మిత్రపక్షాలుగా ఉన్న మా పార్టీలను అది కనీసం లెక్క చేయడం లేదు. భాజపా ఇదే తీరుతో వ్యవహరిస్తే మా మూరు పార్టీలు విలీనం చేసి, ఒకే పార్టీని ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితి వస్తే దానికి భాజపాయే కారణం అవుతుందని గ్రహించాలి. మాకు అటువంటి ఆలోచన కలిగినప్పటికీ, మేము ఇంకా మిత్రధర్మం పాటిస్తూ, భాజపాతో కలిసి కొనసాగుతున్నాము. కనుక ఇకనుంచయినా భాజపా తన తీరు మార్చుకొంటుందని ఆశిస్తున్నాము,” అని చెప్పారు.
భాజపా కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఉండి ఉంటే జితన్ రామ్ మంజీకి ముఖ్యమంత్రి పదవో లేక మరొకటో తప్పకుండా దక్కేది. కానీ వారి కూటమి ఎన్నికలలో ఓడిపోవడంతో ఆయన తీవ్ర నిరాశ చెందారు. ఆ కూటమిలో మిగిలిన రెండు పార్టీల నేతలకి కేంద్ర మంత్రి పదవులు ఉన్నాయి కానీ జితన్ రామ్ మంజీకే ఏ పదవీ లేదు. ఒకవేళ బిహార్ ఎన్నికలలో ఓడిపోయినట్లయితే ఆయనకి కేంద్ర మంత్రి పదవి ఇస్తానని భాజపా హామీ ఏమయినా ఇచ్చిందేమో తెలియదు కానీ, ఆయన ఆ పదవిని ఆశిస్తున్నందునే అది దక్కకపోవడంతో బహుశః ఈవిధంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారేమో?
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభకి ఎన్నికలు జరుగనున్నాయి కనుక ఈ కూటమిలోని మూడు పార్టీలు కలిసి ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష బి.ఎస్.పి. అధినేత్రితో జట్టుకట్టి అధికార సమాజ్ వాదీ ప్రభుత్వాన్ని ఓడిస్తామని జితన్ రామ్ మంజీ చెప్పారు. అంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం భాజపా కంటే ముందుగా పావులు కదిపి ప్రతిపక్ష పార్టీతో చేతులు కలిపి భాజపాని ఒంటరి చేస్తామని ఆయన హెచ్చరిస్తున్నట్లు భావించవచ్చును. కనుక ఆ రాష్ట్రంలో ఎన్నికలు ఎదుర్కొనేందుకు భాజపాకి తన మద్దతు కావాలనుకొన్నట్లయితే, తనను ‘గౌరవించ వలసి ఉంటుందని’ ఆయన చెపుతున్నట్లు భావించవచ్చును. మరి భాజపా ఆయనను గౌరవిస్తుందో లేదో చూడాలి.