భారత్-పాక్ దేశాల మధ్య ఏనాడూ సత్సంబంధాలు లేవు. ఉన్నా అవి ఏదో కొంత కాలానికే పరిమితమయ్యేవి. భారత్ పట్ల పాక్ విద్వేషం వలననే ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనలేదు. అలాగని పాక్ నే పూర్తిగా తప్పు పట్టలేము. పాక్ లో వివిధ ప్రభుత్వేతర శక్తుల ఒత్తిడి కారణంగానే భారత్ పట్ల పాక్ ప్రభుత్వం విద్వేషం వెళ్ళగక్కుతుంటే, భారత్ లో ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాక్ పట్ల భారత్ వైఖరిలో కూడా మార్పులు ఏర్పడటం కూడా అందుకు ఒక కారణంగా చెప్పవచ్చును. పదేళ్ళపాటు యూపియే ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ, అది కూడా పాక్ పట్ల అనిశ్చిత వైఖరితోనే వ్యవహరించింది. అందుకు ఇరుదేశాల ప్రభుత్వాలని తప్పుపట్టవలసి ఉంటుంది.
ఆ తరువాత అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఇంచుమించు అలాగే వ్యవహరిస్తున్నట్లు కనబడుతోంది. నరేంద్ర మోడి ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నేటి వరకు రెండు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులను, జరుగుతున్న పరిణామాలను పరిశీలించినట్లయితే ఆ సంగతి స్పష్టం అవుతుంది. నరేంద్ర మోడీ కూడా పాకిస్తాన్ తో స్నేహమే కోరుకొన్నారు. కానీ అది వ్యతిరేకంగా స్పందించడం వలన, ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. ప్రధాని నరేంద్ర మోడి చొరవ తీసుకొని దానిని తొలగించినప్పటికీ, పఠాన్ కోట్ పై దాడితో పరిస్థితులు మళ్ళీ మొదటికొచ్చాయి. ఆ విషయంలో మోడీ ప్రభుత్వం పాక్ పట్ల చాలా మేతక వైఖరి అవలంభిస్తున్నారనే విమర్శలు వచ్చేయి. పాక్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘జిట్’ బృందాన్ని పఠాన్ కోట్ లో దర్యాప్తుకు అనుమతించడం ద్వారా నరేంద్ర మోడీ పాక్ ముందు మోకరిల్లారని విమర్శలు ఎదుర్కొన్నారు. అంటే నేటికీ మోడీ పాక్ పట్ల సానుకూలంగానే వ్యవహరిస్తున్నారని భావించవలసి ఉంటుంది.
కానీ ఆయన బ్రసెల్స్, అమెరికా, నేడు సౌదీ అరేబియా పర్యటనల ద్వారా పాకిస్తాన్ కి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలని ఏకం చేయడమే లక్ష్యంగా పెట్టుకొన్నట్లు ఆయన మాటల ద్వారా అర్ధమవుతోంది. (పాక్ ప్రేరిత) ఉగ్రవాదానికి, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్తాన్ పై ఐక్యరాజ్యసమితి మరియు ప్రపంచ దేశాల ద్వారా ఒత్తిడి తీవాలని ఆయన గట్టి ప్రయత్నాలు చేయడం అందరూ చూసారు. ముఖ్యంగా పాక్ ప్రభుత్వ రక్షణలో ఉన్న జైష్-ఏ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మౌలానా మసూద్ అజహర్ పై నిషేధం విధించడానికి మోడీ గట్టి ప్రయత్నాలే చేసారని చెప్పవచ్చును. ఒకవేళ మోడీ కనుక ఐక్యరాజ్యసమితిని అందుకు ఒప్పించగలిగి ఉండి ఉంటే, దాని వలన పాకిస్తాన్ చాలా ఇబ్బందికరమయిన పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చేది. కానీ చైనా సహాయంతో పాక్ త్రుటిలో తప్పించుకోగలిగింది. అంటే ప్రధాని నరేంద్ర మోడి పాకిస్తాన్ని పరోక్షంగా దెబ్బ తీయాలని ప్రయత్నించినట్లే స్పష్టం అవుతోంది.
ఇవ్వాళ్ళ ఆయన పాకిస్తాన్ కి మిత్రదేశమయిన సౌదీ అరేబియాలో పర్యటించబోతున్నారు. ఆ దేశం కూడా పాకిస్తాన్ కి చాలా ఉదారంగా భారీగా ఆర్ధిక సహాయం చేస్తుంటుంది. సౌదీతో భారత్ కి ఇంతవరకు కేవలం వ్యాపార, ఉద్యోగ పరమయిన సంబంధాలు మాత్రమే ఉన్నాయి తప్ప పెద్దగా దౌత్య సంబంధాలు లేవనే చెప్పవచ్చును. అయితే ఈసారి మోడీ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం ఆ దేశంతో కొత్తగా కొన్ని వ్యాపార ఒప్పందాలు చేసుకోవడంతో బాటు, ఇరుదేశాల రక్షణ ఒప్పందాలు, మిలటరీ సహకారణ-శిక్షణ వంటివి కూడా ఉన్నాయని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు.
భాజపా ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ప్రధాని పర్యటనపై మరింత స్పష్టత ఇచ్చేరు. “మా ఉద్దేశ్యం చాలా స్పష్టంగానే ఉంది. పాకిస్తాన్ని దారిలో పెట్టేందుకు ఏమేమి చేయాలో అవన్నీ చేయక తప్పదని మేము భావిస్తున్నాము. అందుకే దాని మిత్రదేశాలతో వర్తక, వాణిజ్య, వ్యూహాత్మక, భావనాత్మక సంబంధాలు పెంచుకొని ఆ విధంగా వాటి ద్వారా కూడా పాక్ పై ఒత్తిడి తేవడమే మా ఉద్దేశ్యం,” అని చెప్పారు. అంటే పాక్ పట్ల మోడీ ప్రభుత్వానికి కూడా ఒక నిశ్చితమయిన వైఖరి లేదనే సంగతి స్పష్టం అవుతోంది. ఒక పక్క పాక్ కి స్నేహ హస్తం అందిస్తూనే, మరో పక్క దానిపై అన్ని వైపుల నుంచి ఒత్తిడికి గురిచేసి దారికి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తునట్లుంది.
భారత్ పట్ల పాక్ ఎంత అనిశ్చిత వైఖరి అవలంభిస్తుంటుందో, భారత్ కూడా పాక్ పట్ల అటువంటి అనిశ్చిత వైఖరినే అవలంభిస్తున్నట్లు అర్ధమవుతోంది. అయితే అంతకంటే వేరే మార్గం కూడా లేదు కూడా. అందుకే భారత్-పాక్ ఒకదానినొకటి ఎన్నడూ నమ్మవు. అందుకే ఎన్ని దశాబ్ధలయినా వాటి మధ్య సంబంధాలు బలపడలేకపోతున్నాయని చెప్పక తప్పదు.