బాహుబలి జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడాన్ని ఎంతగా హర్షిస్తున్నా చిత్ర పరిశ్రమలో దీనిపై చర్చ జరుగుతూనే వుంది. వినోదాత్మక వాణిజ్య చిత్రమనో లేక సాంకేతిక విలువల పరంగానో ఎన్ని అవార్డులు ఇచ్చినా అదో విదంగా వుండేది. కాని ఏకంగా ఉత్తమ చిత్రం అనడంతో అందులో ఏమిటి ఉత్తమం అనే ప్రశ్న ఉత్పన్నమైంది.
ఈ పురస్కారం వెనక చాలా మంది నిలబడ్డారని ఒక పత్రిక చేసిన వ్యాఖ్యానం ఆసక్తికరమైంది. ఈ వ్యాఖ్యను అనేక విధాల అర్థం చేసుకోవచ్చు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, హీరో కృష్ణం రాజులతో పాటు న్యాయనిర్ణేతల సంఘంలో దర్శకుడు కె.వాసు వుండటం కూడా ఈ నిర్ణయానికి దోహదం చేసిందని పరిశీలకులు అంటున్నారు. కృష్ణం రాజును చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన ప్రత్యగాత్మ కుమారుడే కె.వాసు.
ఈ అవార్డుపై తెలుగు పత్రికలు చాలా వరకూ ఎలాటి వ్యాఖ్యానం చేయకపోయినా ఇంగ్లీషుపత్రికలు మాత్రం సూటిగానే వ్యాఖ్యానించాయి. ముఖ్యంగా ఇండియన్ ఎక్స్ప్రెస్ పలువురు ప్రముఖుల వ్యాఖ్యలు తీసుకుంది. ఆ పత్రిక సంపాదకీయంలోనూ అభినందనలు చెబుతూనే బాహుబలి ఉత్తమ చిత్రం కాకపోవచ్చని కూడా వ్యాఖ్యానించడం ఆసక్తికరం. అయితే తన ఘన విజయంతో పరిశ్రమకు వూపిరి పోసింది గనక దాన్ని ఎంపిక చేయడంలో తప్పు లేదని పేర్కొంది. భాషా చిత్రాలను మరింతగా గమనించాల్సిన అవసరాన్ని ఈ ఎంపిక రుజువు చేసిందిని హిందూ రాసింది. నిజంగానే తన తండ్రి మహేష్ బట్ తనను భాషా చిత్రాలు చూడమని ఎక్కువగా చెబుతుంటాడని పూజాభట్ ఈ పురస్కారాల తర్వాత చేసిన వ్యాఖ్య గమనించదగింది. అదే బాహుబలి ప్రత్యేకత అవుతుంది. తెలుగు, తమిళ వెర్షన్లు మాత్రమే అవార్డు కోసం తీసుకున్నారు ఎందుకంటే దానిని హిందీలోకి డబ్ చేయడం మాత్రమే జరిగింది.