తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పవర్ పాయింట్ ప్రెజంటేషన్‌పై అదేపనిగా ప్రశంసలతో ఆకాశానికెత్తేవారు పదేళ్ల కిందటి చంద్రబాబు నాయుడును గుర్తు చేసుకుంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ రోజుల్లో ఆయన నోరు విప్పితే కంప్యూటర్లు, ఐటి, హైటెక్ పదాలే వినిపించేవి. బహుశా నిబంధనలకు వెరచి శాసనసభలో ఆ పనిచేయలేదేమో గాని చాలా చోట్ల కంప్యూటర్లలో చూపించడం, విడియో కాన్ఫరెన్సులు ఆయనకు చాలా ఇష్టంగా వుండేవి.
ఇప్పుడు కెటిఆర్ ఎక్కువగా ఆ మార్గంలో నడుస్తున్నట్టు కనిపిస్తుంది. వైఫైలు, ఫైబర్ ఆప్టిక్లు, 4 జిలు, హబ్‌లు, స్టార్టప్‌లే ఆయన నోట ఎప్పుడూ వినిపిస్తుంటాయి. ఐటి వాణిజ్యానికి వున్న అవకాశాలు, అవరోధాలు కూడా గతంలోనే దేశమంతా చూసింది. సాఫ్ట్వేర్ హార్డ్ రియాలిటీ అని అప్పట్లో అనుకునేవారు. సమాచార పరిజ్ఞానాన్ని ఆహ్వానిస్తూనే అదే గొప్ప అనుకోవడం వాస్తవికత కాదని చెప్పాల్సి వుంటుంది.
మళ్లీ ప్రస్తుతాంశానికి వస్తే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు బిల్‌గేట్స్‌ను కలుసుకోవడానికి వెళ్లినప్పుడు కూడా కంప్యూటర్ షో చేయడం మర్చిపోరానిది. అయితే కెసిఆర్ మాత్రమేగాక తుమ్మల నాగేశ్వరరావు వంటి వారు కూడా ఆ రోజుల్లో ఆయనతో వున్నారు. వాస్తవానికి కెసిఆర్ ఆ రోజుల్లోనే రిసోర్స్ పర్సన్‌గా వుండేవారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో తరగతులు తీసుకునేవారు. అందుకే మొన్న సభలో తుమ్మల ఒక సందర్బంలో ‘మీ అద్యక్షుడికి కూడా మేమే క్లాసులు చెప్పాం’ అన్నారు. కాస్త ముందు వెనక తప్పిస్తే వీరందరికి ఒకే స్కూలు అనడంలో సందేహమే లేదు. అందుకే తక్షణ సమస్యలపై కన్నా నిర్మాణాలు, సాంకేతిక విన్యాసాలు, ఆధ్యాత్మిక తతంగాలపై అధికంగా సమయం గడపడం కామన్‌గా కనిపిస్తుంది. బహుళ పార్టీలు ఉద్యమ నేపథ్యం…కొత్త రాష్ట్రం కావడం తెలంగాణకు కొంత భిన్నత్వాన్నిస్తే ఎపిలోి మరింత బాహాటంగా చంద్రబాబు అనుకున్నది అమలు చేయగలరు.