ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ప్రతిపక్షాలు అనే వాటిని నామమాత్రంగా మార్చేయాలని, 80 శాతం ఓటర్లు తెలుగుదేశాన్నే ఆదరించే పరిస్థితిని తయారుచేసుకోవాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్న చంద్రబాబునాయుడు.. అందుకు వీలుగా సంక్షేమ పథకాలను కూడా వాడుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారులకు అందే ప్రతిరూపాయి ద్వారా పార్టీకి ఎంతో కొంత మైలేజీ వచ్చే పరిస్థితి ఏర్పడాలని ఆయన ఆరాటపడుతున్నట్లుగా కనిపిస్తోంది. పథకాల ద్వారా అందే లబ్ధిని ఏకంగా జనానికి ఇచ్చేయకుండా.. పార్టీ నాయకుల ద్వారా వారికి అందే ఏర్పాటుచేస్తే పార్టీకి మేలు జరుగుతుందనే వ్యూహంతో ఉన్నారు. దీని ద్వారా అవినీతిని నియంత్రించడం సాధ్యం అవుతుందని అంటూ… పార్టీకి లబ్ధి జరిగే మార్గాలను చంద్రబాబునాయుడు కొత్తగా సృష్టిస్తున్నారు.
ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయం ఉండాలనే మాటను చంద్రబాబునాయుడు ప్రతి సందర్భంలోనూ చెబుతూనే ఉంటారు. దాని అర్థం ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాల తాలూకు ప్రజాదరణను పార్టీ పొందాలని ఆయన అన్యాపదేశంగా పార్టీ శ్రేణులకు బోధిస్తూనే ఉంటారు. ప్రభుత్వం చేపట్టిన పథకాల గురించి ప్రచార జాతాలను పార్టీ ద్వారా నిర్వహింపజేసినా, నియోజకవర్గాల్లో ప్రభుత్వ పథకాలు ఏవి అందాలన్నా సరే.. తెదేపా నేతల సిఫారసుల ద్వారానే రావాలనే అనధికారిక అదేశాలను వ్యవస్థీకృతం చేసినా…. ఈ ప్రక్రియలో భాగంగానే అవన్నీ జరిగాయి.
అయితే దీనిని ప్రస్తుతం మరింత బలోపేతం చేయాలని చంద్రబాబునాయుడు అనుకుంటున్నట్లుంది. శనివారం కేబినెట్ తర్వాత మంత్రులతో పార్టీ నాయకులతో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో అన్నీ ఇలాంటి సూచనలే చంద్రబాబు చేసినట్లు తెలుస్తున్నది. లబ్ధిదారులకు నిధులు నేరుగా ఇవ్వడం వలన పార్టీకి తగినంత మైలేజీ రావడం లేదన్నది ప్రస్తుతం అధినేత భావన. పార్టీకి మైలేజీతో పాటూ నిధుల పంపిణీలో అవకతవకలను, అవినీతిని నియంత్రించాలంటే పార్టీ నాయకుల ద్వారా అందే ఏర్పాటు చేయాలని చంద్రబాబునాయుడు సంకల్పిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదేసమయంలో పేదలకు 6 లక్షల పక్కాఇళ్లను నిర్మించడానికి కూడా సర్కారు నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ లబ్ధిదారులనంతా పార్టీ వారి ద్వారానే ఎంపికచేస్తే.. పార్టీకి మైలేజీ వస్తుందనేది ఆయన ఆలోచన.
ఏతావతా.. సర్కారు ఏంచేసినా సరే దాని ఫలితం.. ఓట్లరూపంలోకి కన్వర్ట్ అయి తెలుగుదేశానికి మేలు ఒనగూరేలా ఉండాలనే వ్యూహంతో చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నట్లుంది. నిజానికి ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా ఇదే పనిచేస్తుంది. కాకపోతే చంద్రబాబునాయుడు మరింత ఆర్గనైజ్డ్గా దీనిని చేయబోతున్నట్లు అనిపిస్తోంది.