వైఎస్ జగన్మోహనరెడ్డికి సిబిఐ కోర్టుకు ప్రతిశుక్రవారం హాజరయ్యే బాధ తప్పడం దేనికి సంకేతం? ఈ కేసులో చార్జిషీట్లు ఎదుర్కొంటున్న చాలామంది నెమ్మదిగా విముక్తి పొందుతున్నారు. ఐఎఎస్ అధికారి రత్నప్రభ, బిపిఆచార్య, పొట్లూరి వరప్రసాద్, పునీత్ దాల్మియా, ఎస్‌ఎన్‌మహంతి ఇలా వరుసగా చాలా మంది వివిద రకాలైన ఉపశమనాలు పొందారు. చివరకు ప్రతిపక్ష నేతగా బాధ్యతలు వుంటాయి గనక జగన్ కూడా ప్రతివారం రాకుండా మినహాయింపు నివ్వాలని కోరితే ఓకె చెప్పేసింది కోర్టు.
జగన్ త్వరలోనే జైలుకు పోతాడని తెలుగుదేశం నాయకులు రోజూ దెప్పిపొడుస్తుంటే ఆయనకు ఉపశమనం లభించడం యాదృచ్చికం కాదని దీని వెనక తమ ప్రభుత్వ అండదండలున్నాయని బిజెపి రాష్ట్ర నేతలు చెబుతున్నారు. ఈ కేసును మరీ తీవ్రంగా తీసుకోవనసరం లేదని యథాలాపంగా నడిపిస్తే చాలని మోడీ సర్కారు భావిస్తున్నదట.
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కలిసి వచ్చే కమ్యూనిస్టేతర పార్టీలన్నిటినీ కూడగట్టాలనుకున్నప్పుడు బలమైన వైసీపీని విస్మరించలేమని ఢిల్లీ నేతలు భావిస్తున్నారట. ఎపికి సహాయంలో జాప్యం వల్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎలాగో నెట్టుకొస్తున్నారు. కాని ఎన్నికలు దగ్గరపడేకొద్ది ఆయన ఇలాగే వుండకపోవచ్చు. పైగా శాశ్వతంగా ఎపిని తెలుగుదేశంకే అప్పగించవలసిన అవసరం బిజెపికి లేదు.
‘మోడీ మోత’ తగ్గుతున్న కొద్ది రేపు ఎన్నికల్లో గనక అవసరమైతే అందరి సహాయం తీసుకోవలసి వుంటుంది. అప్పటికి చంద్రబాబు తమతో వుంటారో లేదో తెలియదు. పవన్ కళ్యాన్ కార్డు ఎలా వుండేది వూహాజనితమే. కనుక వైసీపీతో కూడా మంచిగా వుండాలనే బిజెపి నేతలు భావిస్తున్నారు. సిబిఐ కేంద్ర హౌంశాఖ అధీనంలోనే వుంటుంది గనక కాస్త నెమ్మదిగా వెళ్లమని సంకేతాలిస్తున్నారు. నిందితుల అభ్యర్థనలను గట్టిగా వ్యతిరేకించడం లేదు. దానికి తగినట్టు జగన్ కూడా కేంద్రంపై సుతిమెత్తగానే మాట్లాడుతున్నారు. అదీ కథ.