గ్రహాలు పలికిన జోస్యం నిజం కాబోతున్నదా? జ్యోతులనెహ్రూ తెలుగుదేశం పార్టీలోకి చేరడం ఖరారు అయిన తర్వాత.. ప్రస్తుత డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ.. జ్యోతుల పార్టీలోకి రాదలచుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ.. ఆయనకు ఇరిగేషన్ శాఖ అంటే ఎంతో ఆసక్తి ఉన్నదని ఒక చిన్న సంకేతం వదిలారు. ఇప్పుడు సదరు చినరాజప్ప జోస్యం నిజం కాబోతున్నట్లుగా ఉంది. శనివారం విజయవాడలో జరిగిన కేబినెట్ భేటీలో నీటిపారుదల శాఖ పనితీరు బాగా లేదంటూ చంద్రబాబునాయుడు ఆ శాఖ మంత్రి దేవినేని ఉమాకు క్లాస్ పీకారని వార్తలు వస్తున్న నేపథ్యంలో… నాలుగురోజుల కిందట చినరాజప్ప చేసిన వ్యాఖ్యలకు ఎనలేని ప్రాధాన్యం వచ్చింది. జ్యోతులకు ఇరిగేషన్ కట్టబెడతారా అనే ఊహాగానాలు కూడా మొదలైపోయాయి.
నిజానికి జ్యోతుల నెహ్రూ పార్టీలోకి రాదలచుకున్న తర్వాత.. ఆయన తెదేపాలోనే ఉండి ఉంటే కాపు కోటాలో ఆయనే డిప్యూటీసీఎం అయిఉండేవారంటూ కొందరు ప్రచారం చేసి, చినరాజప్పకు టెన్షన్ పెట్టారు. దీనికి ప్రతిగానా అన్నట్లు.. జ్యోతులకు ఇరిగేషన్ అంటే ఇంటరెస్టు ఎక్కువ అంటూ చినరాజప్ప దేవినేని ఉమాకు చెక్ పెట్టే ప్రయత్నంచేశారు. ఈ పోకడపై ‘దేవినేని ఉమాను టెన్షన్ పెడుతున్న చినరాజప్ప!’ అనే శీర్షికతో తెలుగు360 డాట్ కాం మార్చి 29న ఓ కథనాన్ని అందించింది కూడా ! తీరా ఇప్పుడు తాజా కేబినెట్ భేటీ పరిణామాల్ని గమనిస్తోంటే అదే నిజమవుతున్నదేమో అనిపిస్తోంది.
చంద్రబాబునాయుడు కేబినెట్ భేటీలో దాదాపు అందరు మంత్రుల పనితీరు మీద మూకుమ్మడిగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. మంత్రులు మరింత బాధ్యత తీసుకుని.. జిల్లాల్లో పర్యటించాలని పార్టీ బలోపేతం కావడానికి కృషిచేయాలని చంద్రబాబు వారికి హితబోధ చేశారుట. అంతా బాగానే ఉంది. కానీ నీటిపారుదల శాఖ పనితీరు ఏమాత్రం అంచనాలకు తగినట్లు లేదని, నీరు చెట్టు, పంటకుంటల పథకాలు సరిగా అమలు కావడం లేదని చంద్రబాబు అన్నట్లు తెలుస్తున్నది. హడావిడి తప్ప అసలు పని జరగడం లేదని, నాయకులు అధికారులు చెబుతున్న దానికి పొంతన ఉండడం లేదని ఆగ్రహించినట్లుగా తెలుస్తున్నది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల మంత్రులు కూడా సరిగా పనిచేయడం లేదని చంద్రబాబు అన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ వ్యవహారం అంతా గమనిస్తోంటే.. మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమవుతున్నట్లే తెలుస్తున్నది.