హైదరాబాద్ కేబీఆర్ పార్క్ ఎదురుగా ఉన్న తెలుగు దేశం పార్టీ ఆఫీసులో మీటింగులప్పుడు ఒకటే సందడి. ఆఫీసు ముందు బారులు తీరిన కార్లు, వచ్చే పోయే నేతలు, కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు. సందడే సందడి. ఇకముందు ఆ దృశ్యం కనిపించే అవకాశం లేదట. జూన్ 15 నుంచి వెలగపూడి నుంచే పరిపాలన సాగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయంచింది. అధికార తెలుగు దేశం పార్టీ కూడా ప్రధాన కార్యాలయాన్ని షిఫ్ట్ చేయాలని నిర్ణయించం తీసుకుందట. అయితే మొదట కొంతకాలం మంగళగిరిలో పార్టీ ఆఫీసు ఏర్పాటవుతుందట.
ఓ వైపు వీలైనంత త్వరగా సొంత రాజధానికి షిఫ్ట్ కావాలనేది చంద్రబాబు ప్రభుత్వ ప్రయత్నం. అమరావతి నిర్మాణం శరవేగంగా జరగడం, అభివృద్ధి పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ముఖ్యం. తరచూ హైదరాబాదుకు వచ్చిపోవడం వల్ల ఎంతో కొంత సమయం వృథా అవుతుందని భావిస్తున్నారు. అలాగే, టీడీపీ ఆఫీసు కూడా అమరావతి సమీపానికి మారబోతోంది.
తెలంగాణలో పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేదు. కేడర్ కాస్త బలంగానే ఉన్నా, ఎమ్మెల్యేలు ముగ్గురే మిగిలారు. తెరాస ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు శాసనసభా పక్షంలో ముగ్గురు మినహా మిగతా వారంతా గులాబీ గూటికి చేరిపోయారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ విజయాలు లేవు. గ్రేటర్ హైదరాబాదులో ఒక్క డివిజన్ దక్కింది. వరంగల్, ఖమ్మంలలో దక్కింది సున్నా.
ఈ పరిస్థితుల్లో 2019 ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయడం కత్తిమీద సామే. ఆ సంగతి తర్వాత, మొదట ఏపీలో చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగించడం మీదే టీడీపీ దృష్టి పెట్టింది. వైసీపీని వీలైనంత దెబ్బ తీయడానికి స్కెచ్ వేసి పక్కాగా అమలు చేస్తోంది. ఇందులో నైతిక విలువ విషయాన్ని పట్టించుకోవడం లేదు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్లాలనే నియమాన్ని అంతా గాలికి వదిలేశారు. తెలంగాణలో అదే జరిగింది. ఏపీలో అదే జరుగుతోంది. బహుశా రెండు నెలల్లో టీడీపీ పూర్తి స్థాయిలో మంగళగిరి నుంచి పనిచేస్తుందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అప్పుడు హైదరాబాద్ ఎన్టీఆర్ భవనానికి పూర్తిగా తాళం వేయపోయినా, నామమాత్రంగా ఒకరిద్దరు సిబ్బంది మాత్రం ఉండొచ్చు. పక్కనే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ బ్లడ్ బ్యాంక్ ఉంది. కాబట్టి అది కొనసాగే అవకాశం ఉంది. మొత్తం మీద హైదరాబాదులో టీడీపీ ఆఫీసు సందడి ఇకముందు కనిపించే అవకాశం లేదన్న మాట.