జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర మొట్ట మొదటి మహిళా ముఖ్యమంత్రిగా మహబూబా ముఫ్తీ నేడు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. కనుక గత 4 నెలలుగా కొనసాగుతున్న గవర్నర్ పరిపాలన నేటితో ముగియబోతోంది. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ జనవరి 7వ తేదీన అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుంచి పిడిపి-భాజపాలు మళ్ళీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి చర్చలు కొనసాగిస్తూనే ఉన్నాయి కానీ వాటి మధ్య ప్రతిష్టంభన నెలకొని ఉండటంతో రాష్ట్రంలో తాత్కాలికంగా గవర్నర్ పాలన విధించబడింది.
పిడిపి అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ వారం రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడిని కలిసి నేరుగా ఆయనతోనే చర్చలు జరిపిన తరువాతనే ఆ రెండు పార్టీల మధ్య మళ్ళీ సయోధ్య కుదిరింది. వెంటనే మహబూబా ముఫ్తీని పిడిపి తమ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోవడం, పిడిపి, భాజపా ఎమ్మెల్యేలు గవర్నర్ ని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకి తమ సంసిద్దతను తెలియజేయడంతో నేడు ఆమె ప్రమాణస్వీకారం చేయడానికి మార్గం సుగమం అయ్యింది. పిడిపి-భాజపాలు కలిసి రాష్ట్రంలో మళ్ళీ రెండవసారి సంకీర్ణప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాయి.
భాజపా తరపున నిర్మల్ సింగ్ ఉపముఖ్యమంత్రిగా నేడు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు హాజరవబోతున్నారు. ఏప్రిల్ 8కి శాసనసభ సమావేశాలు నిర్వహించి ఆరు నెలలు అవుతుంది కనుక ఆలోగా తప్పనిసరిగా శాసనసభ సమావేశాలు జరుపవలసి ఉంటుంది. కనుక మహబూబా ముఫ్తీ నేడు ప్రమాణస్వీకారం చేయగానే రేపు లేదా ఎల్లుండి శాసనసభను సమావేశపరిచే అవకాశం ఉంది.