‘నాకు కాపుల మద్దతు అవసరం లేదు.. నేను కాపులకు మాత్రమే ప్రతినిధి కాను. నాకు అందరూ కావాలి…..’ ఇలాంటి సంచలన స్టేట్మెంట్స్తో కాపులకు కాస్త దూరమయ్యాడు పవన్ కల్యాణ్. జనసేన నాయకుడిగా అందర్నీ కలుపుకుపోవాలన్న ఉద్దేశంతో, ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సివచ్చింది. నిజానికి పవన్ కల్యాణ్ కి ముందు నుంచీ అన్కండీషనల్గా సపోర్ట్ చేస్తోంది కాపు వర్గమే. కోస్తాంధ్రలో కాపుల ప్రాబల్యం ఎక్కువ. పవన్ కల్యాణ్ ‘జనసేన’కు వాళ్లే ఎక్కువగా మద్దతు ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి రావడానికి కాపు ఓట్లు కూడా కారణమయ్యాయి. ఎంతకాదన్నా.. పవన్‌ని ఇంకా తమ నాయకుడిగానే కాపు సోదరులు చూస్తున్నారు. అందుకే వాళ్లని కాస్త శంతపరచడానికి పవన్ ఓ మెగా స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది.
సర్దార్ సినిమాలోని కొన్ని సంభాషణల్లో పరోక్షంగా కాపు ప్రస్తావన తీసుకొచ్చే ప్రయత్నం చేశాడట పవన్. ‘కాపు’ అనే మాటని వేరే అర్థంలో వచ్చేట్టుగా కొన్ని సంభాషణలు పలికాడట. నేను ‘కాపు’కాసేవాడ్ని అంటూ.. కాపు అనే పదాన్ని కాస్త ఒత్తి పలికాడట. ఆ సంభాషణలు కేవలం కాపు వర్గాన్ని మళ్లీ తనవైపుకు తిప్పుకోవడానికే చేస్తున్న ప్రయత్నం అని తెలుస్తోంది. అంతేకాదు.. జనసేన ఉద్దేశ్యాన్ని, తాను ప్రజల మనిషినని చెప్పడానికి కొన్ని సన్నివేశాల్ని సృష్టించాడట. మొత్తానికి సర్దార్కి తన పొలిటికల్ కెరీర్‌కి ప్లస్ అయ్యేలా పవన్ వాడుకొనే ప్రయత్నం చేశాడని ఇండ్రస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి అవి ఎంత వరకూ నిజమో తెలియాలంటే ఏప్రిల్ 8 వరకూ ఆగాల్సిందే.