గుంటూరులో నిన్న కాపు మేధోమధన సదస్సు నిర్వహించబడింది. దానికి కొన్ని గంటల ముందే మచిలీపట్నంలోని నిజాంపేటలో నెలకొల్పిన వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులెవరో ధ్వంసం చేసారు. దానితో కాపు నేతలు చాలా మంది అక్కడికి చేరుకొని నిరసనలు తెలియజేయడంతో నిజాంపేటలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసారు. కొన్ని స్వార్ధ రాజకీయ శక్తులు కులాల మధ్య చిచ్చుపెట్టేందుకే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఈ ఘటనపై తక్షణమే కేసు నమోదు చేసి, దోషులను కనుగొనవలసిందిగా రాష్ట్ర డి.జి.పి.ని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కొల్లు రవీంద్ర అక్కడికి వచ్చి దోషులను కనుగొని శిక్షిస్తామని, రంగా విగ్రహాన్ని పునఃప్రతిష్టిస్తామని హామీ ఇచ్చారు.
ఈ ఘటన సరిగ్గా కాపు మేధోమధన సదస్సు జరుగబోయే ముందే జరగడంతో, ఆ సదస్సును వ్యతిరేకిస్తున్నన్నవారే ఎవరో ఈ దుశ్చర్యకు పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సదస్సుని కాపు నేతలే నిర్వహించినప్పటికీ, వారిలో చాలా మంది రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నవారు, తెదేపా మంత్రులు, ప్రజా ప్రతినిధులే ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు కనుక అది ప్రభుత్వ అనధికారిక కార్యక్రమంగానే నిర్వహించబడిందని భావించవచ్చును.
ఆ సమావేశంలో ప్రభుత్వం తరపున మాట్లాడిన తెదేపా ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, బొండా ఉమామహేశ్వరరావు తదితరులు కాపులకు రిజర్వేషన్ల కోసం, వారి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యల గురించి వివరించి కాపులలో ప్రభుత్వం పట్ల నెలకొన్న అపోహలను తొలగించే ప్రయత్నాలు చేసారు. అందరి ప్రసంగాలు పూర్తయిన తరువాత సభలో కొన్ని తీర్మానాలు ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు.
అధికార పార్టీ ప్రతినిధుల సమక్షంలోనే ఇదంతా జరిగింది కనుక ఆ సదస్సు ద్వారా కాపులలో ప్రభుత్వం పట్ల నెలకొని ఉన్న వ్యతిరేకతను తొలగించి, కాపులకు-తెదేపా ప్రభుత్వానికి, పార్టీకి మధ్య దూరం తగ్గించే ఉద్దేశ్యంతోనే నిర్వహించబడిందని అర్ధం అవుతోంది. కనుక ఆ సమావేశానికి ఆటంకం కలిగించాలని కోరుకొంటున్నవారే ఎవరో కాపులకు గౌరవనీయుడయిన వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని ద్వంసం చేసి ఉండవచ్చును.
రాజకీయ పార్టీలన్నీ నిత్యం నీతులు వల్లిస్తూనే ఉంటాయి కానీ వాటిలోనే ఏదో ఒక పార్టీ ఇటువంటి వికృత చేష్టలు కూడా చేస్తోందని ఈ ఘటన రుజువు చేస్తోంది. ఇటువంటి ఘటనలు గతంలో కూడా చాలాసార్లు జరిగాయి. అప్పుడూ పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేసారే తప్ప ఎవరినీ పట్టుకొని న్యాయస్థానాల ముందు నిలబెట్టలేకపోయారు. బహుశః ఈ కేసును కూడా అలాగే అటకెక్కిస్తారేమో?