తెలంగాణాలో తెదేపాతో పొత్తులు తెంచుకోవడానికి భాజపా సిద్దమవుతున్నట్లు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సూచనప్రాయంగా నిన్న చెప్పారు. ఇంచుమించు అదే సమయంలో విశాఖపట్నం (ఉత్తర) నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్ రాజు అందుకు పూర్తి భిన్నంగా మాట్లాడారు.
ఆయన నిన్న విశాఖలో మీడియాతో మాట్లాడుతూ “తెదేపా-బీజేపీల మధ్య భేదాభిప్రాయాలున్నమాట నిజమే కానీ అవి మా స్నేహాన్ని దెబ్బతీసేంత పెద్దవేమీ కావు. మా రెండు పార్టీల మధ్య మంచి అవగాహనే ఉంది కనుక వీలయినంత ఎక్కువకాలం మేము కలిసి పనిచేస్తాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాజపాని బలోపేతం చేసుకోవడం కోసం మేము గట్టిగా కృషి చేస్తాము. కానీ దానర్ధం తెదేపాతో తెగతెంపులు చేసుకొంటామని కాదు. దానితో మాకు శత్రుత్వం ఉందనీ కాదు. తెదేపాతో మా స్నేహం మున్ముందు ఇంకా బలపడుతుందనే మేము భావిస్తున్నాము,” అని చెప్పారు.
తెలంగాణాలో తెదేపా-బీజేపీ తెగతెంపులు చేసుకొని ఆంధ్రాలో కొనసాగడం సాధ్యమేనా అంటే, తెలంగాణాలో తెదేపా ప్రస్తుత పరిస్థితిని బట్టి సాధ్యమేనని చెప్పవచ్చును. తెలంగాణాలో తెదేపా క్రమంగా తుడిచిపెట్టుకుపోతోంది కనుక అక్కడ ఆ రెండు పార్టీలు ప్రత్యేకంగా తెగతెంపులు చేసుకోవలసిన అవసరం ఉండకపోవచ్చును. కనుక ఆంధ్రాలో అవి ఏవయినా కారణాలతో విడిపోవాలనుకొంటే తప్ప మిత్రపక్షాలుగా కొనసాగడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు.