‘భారత్ మాతాకీ జై!’ అనని వారు దేశంలో వుండటానికి అనర్హులని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్ణవీస్ చేసిన ప్రకటన బిజెపి వైఖరిలో ఎలాటి మార్పు లేదని నిరూపిస్తుంది. జెఎన్‌యు ఘటనల తర్వాత భారత్ మాతాకీ జై (బిఎంకెజె) అనే వారే దేశంలో వుండాలని ఒక వాదన తీసుకొచ్చారు.
ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ మొదట ఈ వాదన చేశారు.. అప్పటి నుంచి చోటా నాయకుల నుంచి బడానేతల వరకూ ఇదే ఇదే మాట్లాడుతూ ఉద్రిక్తత పెంచారు. నిజానికి రాజ్యాంగంలో ఎక్కడా ఆ విధమైన నిబంధనలేదు. జైహింద్, బీ హిందూస్తాన్ జిందాబాద్, బోలో స్వతంత్ర భారత్‌కీ జై వంటి నినాదాలు తప్ప ప్రత్యేకంగా బిఎంకెజె గురించి పట్టు పట్టింది లేదు.
అయితే జనగణమన కన్నా వందేమాతరం గీతం ఉత్క్రుష్టమైందంటూ ఆరెస్సెస్ పరివారం మొదటి నుంచి వాదిస్తోంది. వందేమాతరం పాటకు స్పష్టమైన మతపరమైన నేపథ్యం వుంది. అయినా దేశ స్వాతంత్ర పోరాటంలో ఆ మాట బాగా పనిచేసింది గనకనే రాజ్యాంగ నిర్మాతలు ఎంతగానో చర్చించి చివరకు జనగణమన పాటను జాతీయం గీతంగా చేశారు. ఇది బ్రిటిష్ చక్రవర్తిని కీర్తిస్తూ రాశారని బిజెపి ఆరోపించినా పట్టించుకున్న వారు లేరు. ఎందుకంటే అది నిజం కాదని అందరికీ తెలుసు.
చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఠాగూరు దాన్ని ఇంగ్లీషులోకి అనువదించారు. అంతకు ముందు కాంగ్రెస్ జాతీయ సభల్లో పాడారు…కాని బిజెపి వారు ఎప్పుడు అధికారంలో వున్నా వందేమాతరం ఒక వివాదాస్పద అంశం చేస్తుంటారు. దాని కొనసాగింపుగా భారత్ మాతాకు జై నినాదం తెచ్చారు.
రాజ్యాంగంలో అది తప్పనిసరికాదు గనక వూరికే వివాదం పెంచుకోవడం సరికాదని ఎంతగా చెప్పినా అర్ఠం కాలేదు. అయితే ప్రజల్లో నిరసన చూసిన తర్వా అగ్రనేత అద్వానీ మాత్రం దీనిపై వివాదం తగదని చెప్పారు. ఈ లోగా మజ్లిస్ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ దాన్ని తాను పాడబోనని అన్నారు. అది వారి ఇష్టం.
జైహింద్ అంటామని చెప్పడమే గాక ఆ నినాదంతో ఒవైసీ సోదరుల ఫ్లెక్సీలు కూడా అమర్చారు. రేపు మెహబూబా మఫ్తి కూడా పాడకపోవచ్చు. ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ కూడా ఇష్టమైన వారినే పాడనివ్వండి ఒత్తిడి చేయొద్దు అని సూచించారు. ఆయన సర్దుకున్నా కూడా అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు వంటివారు వివాదం కొనసాగిస్తూన్నారు.
నిజానికి దేశాన్ని మాతృభూమిగా పితృభూమిగా వర్ణించడం మనవాళ్లు పాశ్చాత్య నాగరికతగా నిరసించే యూరప్‌నుంచే వచ్చింది. పురాణ కావ్యాల్లో భారతదేశం అనే మాట వుంది గాని భారత మాత లేదు. (తర్వాత అదే తెలుగు తల్లి, తెలంగాణ తల్లి వంటి రూపాలు తీసుకుంది). రాహుల్ గాంధీ బిఎంకెజె అనకపోయినా జైహింద్ అనైనా అన్నారంటే అది తమ జాతీయవాద విజయమని అరుణ్‌జైట్లీ ఆనందపడటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
మీడియా ప్రముఖులు కరణ్ థాపర్ కూడా బిఎంకెజె అనకపోయినంత మాత్రాన దేశభక్తి లేనట్టుకాదని తేల్చిచెప్పారు. వాక్ స్వాతంత్రం అంటే మౌనంగా వుండే హక్కు కూడా. జనగణమన వేసినప్పుడు లేచి నిల్చుంటే చాలునని, పాడకపోయినంత మాత్రాన శిక్ష వేయలేమని సుప్రీం కోర్టు చెప్పింది.
అధికారిక జాతీయ గీతం విషయంలోనే ఇలా వుంటే ఇక సంఘ పరివార్ ఆదేశిత గీతాన్ని రుద్దడం సాధ్యమయ్యేదే కాదు. ఆరెస్సెస్ ముఖ్యనేత భయ్యాజీ జోషి మాట్లాడుతూ వందేమాతరం నిజమైన జాతీయ గీతమనీ, జనగణమన కేవలం రాజ్యాంగ నిర్దేశితమని తేలిక చేసి మాట్లాడారు. ఆ తర్వాత మళ్లీ ఆరెస్సెస్ ప్రతినిధి దీన్ని సర్దుబాటు చేస్తూ జోషి కేవలం వివరణ కోసమే చెప్పారనీ జనగణమనను త్రివర్ణ పతాకాన్ని గౌరవించాల్సిందేనని పేర్కొన్నారు. అయితే ఇదంతా అయ్యాక మళ్లీ పడ్నవీస్ ఇలా మాట్లాడుతున్నారంటే ఏం చెప్పాలి?