కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం తమ పార్టీకి చెందిన వివిధ రాష్ట్రాల్లో ప్రతిపక్షాలుగా ఉన్న ఎమ్మెల్యేలుగా ఉన్న వారిమీద అసంతృప్తిని వ్యక్తం చేయడానికి ఒకే తరహా మూస పాట నేర్చుకున్నట్లుగా కనిపిస్తోంది. ”అధికార పార్టీతో మీరు అంచనాల మేరకు పోరాడడం లేదు, అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో మీరు విఫలం అవుతున్నారు… అధికార పార్టీ పనికిరాదు అనే సంగతిని ప్రజల్లో తీసుకువెళ్లలేకపోతున్నారు…” అంటూ పదేపదే తమ ఎమ్మెల్యేలకు తలంటు పోస్తూ ఉంటే.. వారు లోకల్‌గా అధికార పార్టీని తిడుతూ ఉంటారని వ్యూహంగా భావిస్తున్నట్లుంది.
అవును మరి.. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ మీద ఎంతగా విరుచుకుపడుతున్నప్పటికీ… వారిని ఢిల్లీ పిలిపించిన ప్రతి సందర్భంలోనూ.. రాహుల్‌గాంధీ.. ఇలాంటి వ్యాఖ్యలతో వారిని రెచ్చగొట్టడానికి చేసిన ప్రయత్నాలు ప్రజలకు తెలుసు.
ఇప్పుడు గుజరాత్ విషయంలో కాంగ్రెస్ నాయకత్వం మరో అడుగు ముందుకేసి… తమ ఎమ్మెల్యేలను అధికార భాజపాపై యుద్ధానికి సన్నద్ధం చేస్తున్నట్లుంది. పైగా ఎమ్మెల్యేలుగా సరిగా పోరాడకుంటే… ఈసారి ఎన్నికల్లో వారికి టికెట్లు ఇవ్వబోయేది కూడా లేదంటూ ఇప్పటినుంచే హెచ్చరికలు జారీచేస్తున్నది.
గతంలో మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయాలను, ఇప్పుడు ఆయన వారసురాలిగా ఆనందిబెన్ పటేల్ సాగిస్తున్న పరిపాలనను విమర్శించాల్సిందిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. భాజపా పట్ల మెతకవైఖరి చూపిస్తే ఎన్నికల టికెట్లు దక్కబోవంటూ ఘాటుగానే హెచ్చరిస్తున్నారట.
ఆనందిబెన్ కుమార్తెకు అక్రమంగా భూకేటాయింపులు జరిగాయని విమర్శలు వచ్చాయి. వీటిపై పోరాడడంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు విఫలమయ్యారని కాంగ్రెస్ నాయకత్వం బాధపడుతున్నదిట. సోనియా అల్లుడికి భూపందేరం గురించి ఎంత రచ్చ అయిందో అందరికీ తెలుసు. ఆ విషయంలో తాము మాత్రం అంతగా భ్రష్టు పట్టాక, ప్రత్యర్థులను అదేస్థాయిలో బద్నాం చేయలేకపోవడంపై వారికి గుర్రుగా ఉన్నట్లుంది పాపం! అయినా… పసలేని పోరాటాలు చేసి పరువు పోగొట్టుకోవడం ఎందుకు అని లోకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భావిస్తుండవచ్చు. అయినా టికెట్లు ఇవ్వబోమంటూ నాయకత్వం హెచ్చరికలు మాత్రం వారిని భయపెట్టేవే అని చెప్పకతప్పదు!