కృష్ణ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దేవినేని అవినాష్ త్వరలో తెదేపాలో చేరబోతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చేయి. వాటిని బలపరుస్తున్నట్లు ఆయన మొన్న తెదేపా మంత్రులు, మాజీ ఎంపి హరికృష్ణ తదితరులతో కలిసి విజయవాడలో పశువుల ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయనతో బాటు వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని కూడా హాజరయ్యారు. వారిరువురితో హరికృష్ణ చాలాసేపు మాట్లాడారు కూడా. కొడాలి నాని తెదేపాలో చేరే విషయంలో ఇంకా కొంచెం అనుమానంగానే ఉన్నప్పటికే దేవినేని అవినాష్ మాత్రం తప్పకుండా తెదేపాలో చేరుతారని అందరూ భావించారు.
తెదేపా సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణం నాయుడు స్వయంగా అవినాష్ తండ్రి దేవినేని నెహ్రు వద్దకు వెళ్లి మాట్లాడిన తరువాతనే అవినాష్ ఈ కార్యక్రమానికి హాజరయినట్లు వార్తలు వచ్చేయి. ఇది జరిగి రెండు రోజులు కూడా కాలేదు. మళ్ళీ అంతలోనే ఏమయిందో తెలియదు కానీ ఇవ్వాళ్ళ దేవినేని అవినాష్ విజయవాడలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తున్నారు.
తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు రెండేళ్ళు పూర్తవుతున్నా ఇంతవరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, అధికారంలోకి రావడం కోసమే చంద్రబాబు నాయుడు ప్రజలకు మాయమాటలు చెప్పి మభ్యపెట్టారని, నేటికీ ఇంకా మభ్యపెడుతూనే ఉన్నారని అవినాష్ ఆరోపించారు. రాష్ట్రంలో యువతకు జాబు రావాలంటే బాబు రావాలని ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన చంద్రబాబు నాయుడు ఇంతవరకు కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఈయకపోయినా ఉన్న ఉద్యోగాలను కూడా ఊడగొట్టే పరిస్థితులు కల్పించారని దేవినేని అవినాష్ ఆరోపించారు. కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లాది విష్ణు, జిల్లా నేతలు, కార్యకర్తలు ఆయన దీక్షకి మద్దతు తెలిపారు.
రెండు రోజుల క్రితమే తెదేపాలో చేరుతారనుకొన్న దేవినేని అవినాష్ ఇవ్వాళ్ళ అకస్మాత్తుగా అదే తెదేపా ప్రభుత్వానికి, దాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా దీక్ష చేపట్టి విమర్శిస్తున్నారంటే ఆయన తెదేపాలో చేరడం లేదని స్పష్టం చేసినట్లయింది. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇటువంటి ఎన్ని దీక్షలు చేసినా దాని వలన ప్రయోజనం ఉండదని అందరికీ తెలుసు. కానీ చేస్తున్నారంటే ఆయనకి వేరే ఉద్దేశ్యం ఉన్నట్లు భావించవలసి ఉంటుంది. రెండేళ్ళు పూర్తవుతున్నా తెదేపా తన హామీలను నిలబెట్టుకోలేదని విమర్శిస్తున్న దేవినేని అవినాష్ కూడా ఈ రెండేళ్ళలో ఏనాడూ ఆ హామీల అమలు గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అటువంటి వ్యక్తి ఏకంగా దీక్షకే కూర్చోన్నారంటే బహుశః వైకాపాలో చేరే ఆలోచనతో ఉన్నారేమోనని అనుమానించవలసి వస్తోంది.