కంగారు పడాల్సిన అవసరమేమీ లేదు.. ఇది నారా లోకేష్ గురించి వెరైటీ కబురు మాత్రం కానే కాదు. ఇక మిగిలిన నారా వారబ్బాయి హీరో రోహిత్ మాత్రమే కదా.. అని మీరు గెస్ కొట్టవచ్చు. అవును మీ అంచనా నిజమే. నారా రోహిత్ చాలా మంచి వంటవాడు కూడా! కుర్రాడికి ఇంకా పెళ్లి కూడా కాలేదే.. అప్పుడే వంటలో ఇంతలా పొగిడించుకునే టేలెంట్ ఎలా వంటబట్టిందబ్బా..? అని మళ్లీ ఆశ్చర్యపోకండి. నారా రోహిత్ స్వతహాగానే వంట చాలా బాగా చేస్తాడుట. ఏదో ముచ్చట తీర్చుకోవడానికి ఇంట్లో వంటరిగా ఉన్నప్పుడు వంట చేసుకు తినడం మాత్రమే కాదు, షూటింగ్ లొకేషన్లో ఉన్నా కూడా తన పాకకౌశలాన్ని.. అదేనండీ.. వంట చేయడంలో తన నైపుణ్యాన్ని సహనటులకు రుచిచూపిస్తాడుట.
ఇది నిజం. సావిత్రి సినిమాకు సంబంధించి సినిమా యూనిట్ సభ్యులంతా కలిసి ఏర్పాటుచేసిన సక్సెస్ మీట్లో కమెడియన్ సత్యం రాజేష్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. నారా రోహిత్ హీరోగా మాత్రమే మీకందరికీ తెలుసు. కానీ ఆయన చాలా మంచి వంటగాడిగా కూడా మాకు తెలుసు. ఎందుకంటే ఆయన షూటింగ్ టైంలో మంచి మంచి వంటలు చేసి మాకు పెట్టారు.. అంటూ అసలు సీక్రెట్ ముడి విప్పేశాడు సత్యం రాజేష్.
షూటింగులో ఉన్న జట్టు సభ్యులందరికీ ఇంటినుంచి తినుబండారాలు, వంటలు ప్రత్యేకంగా తీసుకువచ్చి వడ్డించే నటులు మనకు పాతకాలంనుంచి ఎందరో ఉన్నారు. అయితే లొకేషన్లోనే తానే స్వయంగా వండి మరీ రుచులను పంచే హీరోలు లేరనే చెప్పాలి. మొత్తానికి, తెలుగు సినీ ఇండస్ట్రీనుంచి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరుగా ఉన్న నారా రోహిత్‌కు, వంట క్వాలిటీ కూడా ఉన్నదంటే.. పెళ్లి సంబంధాలకు అదనపు క్వాలిఫికేషన్ అన్నమాటే కదా!!