పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం అన్నట్లుంది వైకాపా పరిస్థితి. ఇంతవరకు తెలంగాణాలో తెదేపా పరిస్థితి కూడా అలాగే ఉండేది. ఇంకా ఆ పార్టీ నుంచి ఆకర్షించడానికి ఎవరూ మిగలకపోవడంతో కేసీఆర్ తెదేపాని విడిచిపెట్టేసినట్లుంది కానీ ఆంధ్రప్రదేశ్ లో వైకాపాలో ఇంకా 57మంది ఎమ్మెల్యేలున్నారు కనుక తెదేపాకి చేతి నిండా పనే అన్నట్లుంది. జగన్మోహన్ రెడ్డి తను ముఖ్యమంత్రి అవడంకోసం ప్రజలేన్నుకొన్న ప్రభుత్వాన్ని కూల్చుతాననడం ఎంత తప్పో ఇది కూడా అంతకంటే పెద్ద తప్పేనని చెప్పక తప్పదు. కానీ ఇప్పుడు వైకాపా ఎమ్మెల్యేల చేత పార్టీ ఫిరాయింపజేస్తూ అందరి కళ్ళ ముందు ప్రజాస్వామ్యాన్ని దారుణంగా ఖూనీ చేసేస్తున్నందుకు ఎవరూ కూడా పెద్దగా బాధ పడకపోగా అదేదో చాలా గొప్ప విషయం అన్నట్లుగా లేదా రాజకీయాలలో ఇటువంటివన్నీ చాలా సర్వసాధారణం అన్నట్లు చాలా మంది భావిస్తుండటం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇంక విషయంలోకి వస్తే పార్టీ ఫిరాయిద్దామని డిసైడ్ అయిపోయి మళ్ళీ జగన్ అభ్యర్ధనతో చివరి నిమిషంలో ఆగిపోయిన మైదుకూరు ఎమ్మెల్యే రఘురామి రెడ్డి, కడప ఎమ్మెల్యే అంజద్ బాషా ఇద్దరూ కూడా మళ్ళీ తెదేపాలో చేరిపోవడానికి మళ్ళీ మూటాముల్లె సర్దుకొంటున్నట్లు తాజా సమాచారం. వారిద్దరూ ఈ విషయాన్ని అధికారికంగా ఇంకా దృవీకరించలేదు కానీ పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది.