నందమూరి బాలకృష్ణ వందో సినిమాకి సంబంధించిన పనులు జోరుగా సాగుతున్నాయి. నటీనట, సాంకేతి వర్గం పేర్లు ఒకొక్కటిగా ఖరారవుతున్నాయి. క్రిష్ యూరప్ వెళ్లి లొకేషన్లు చూసుకొచ్చే పనిలో పడ్డాడు. ఈలోగా.. టైటిల్ విషయంలో నెలకొన్న సందిగ్థత కూడా దాదాపుగా తెరపడినట్టైంది. ఈ సినిమాకి గౌతమి పుత్ర శాతకర్ణి అనే పేరు పెట్టే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్టు ముందు నుంచీ వార్తలొస్తున్నాయి. అయితే మధ్యలో యోధుడు అనే టైటిల్ కూడా వినిపించింది. గౌతమిపుత్ర.. కంటే యోధుడు అన్న టైటిల్ బాలయ్యకు సరిగ్గా సరిపోతుందని, లెజెండ్, డిక్టేటర్‌లో ఉన్న పవర్.. యోధుడు పేరులోనూ ఉందని బాలకృష్ణ కాంపౌండ్ వర్గాలు అభిప్రాయ పడ్డాయి.
దానికి తోడు మూడక్షరాలతో సింపుల్‌గా ఉండడంతో బాలయ్య యోధుడు టైటిల్ వైపే మొగ్గు చూపిస్తారని అనుకొన్నారు. అయితే.. బాలయ్య మాత్రం కథని ప్రతిఫలించే.. గౌతమి పుత్ర శాతకర్ణి టైటిల్ కే ఓటేశారు. దాంతో.. ఈ టైటిలే ఖాయమైందిప్పుడు. ఫిల్మ్‌ఛాంబర్‌లోనూ.. గౌతమి పుత్ర శాతకర్ణి టైటిల్‌నే రిజిస్టర్ చేయించింది చిత్రబృందం. సో.. టైటిల్ విషయంలో ఏర్పడిన కన్‌ఫ్యూజన్‌కి తెరపడినట్టైంది. ఈ ఉగాదిన సినిమాకి సంబంధించిన తొలి అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. ఈనెలలోనే లాంఛనంగా షూటింగ్ ప్రారంభిస్తారు. మేలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.