కింగ్ ఫిషర్ అధినేత 17 బ్యాంకులకు ఏకంగా రూ. 9000 కోట్లు నామం పెట్టేసి లండన్ చెక్కేసిన తరువాత అతనిపై చర్యలకు సుప్రీం కోర్టు మరియు కేంద్రప్రభుత్వం సిద్దం అవుతున్నట్లు సంకేతాలు ఇవ్వడంతో మాల్యా దిగివచ్చేరు. బ్యాంకులకు చెల్లించవలసిన మొత్తంలో రూ. 4000 కోట్లు సెప్టెంబరు నెలాఖరులోగా రెండు వాయిదాలలో చెల్లిస్తానని, మిగిలిన మొత్తం తరువాత మెల్లగా చెల్లిస్తానని తన న్యాయవాది ద్వారా సుప్రీం కోర్టుకి తెలియజేసారు.
ఆయన చేసిన ప్రతిపాదన బ్యాంకర్లకు ఆమోదయోగ్యమా కాదో తేల్చుకోమని సుప్రీం కోర్టు వారం రోజులు గడువు ఇచ్చింది. దానిపై 17 బ్యాంకుల ప్రతినిధులు చర్చించుకొన్న తరువాత, తమకు ఆ ప్రతిపాదన ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పాయి. కనీసం రూ.8000 కోట్లు చెల్లించే మాటయితేనే కోర్టు బయట సెటిల్మెంటుకి సిద్దం అవ్వాలని నిర్ణయించుకొన్నాయి. అదే విషయాన్ని ఏప్రిల్ 7వ తేదీన సుప్రీంకోర్టుకి కూడా తెలియజేయబోతున్నాయి.
బ్యాంకులకి బాకీ ఉన్న మొత్తం సొమ్ముని పూర్తిగా చెల్లించి తన గౌరవం కాపాడుకోవాలని లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తప్పవని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ విజయ్ మాల్యాని హెచ్చరించారు. ఆయన హెచ్చరించిన తరువాతే విజయ్ మాల్యా ఈ ప్రతిపాదన చేసారు. కానీ ఇప్పుడు బ్యాంకులు అందుకు అంగీకరించడం లేదు కనుక ఆయన ఈ సమస్య నుంచి బయటపడటానికి మరో మార్గం కనుగొనక తప్పదు.