ఐటి, కంప్యూటర్స్, సాఫ్ట్ వేర్ కంపెనీల గురించి మాట్లాడుకొన్నప్పుడు హైదరాబాద్ లో వాటి అభివృద్ధి కొరకు చంద్రబాబు నాయుడు చేసిన కృషి గురించి తలుచుకోకుండా ఉండలేము. ఒకానొక సమయంలో ఐటి అంటే ఆయన పేరు తలుచుకొనేలా చేసారు. కానీ ఆ విషయంలో చంద్రబాబు నాయుడు కంటే ఇప్పుడు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కె.టి.ఆర్. చాలా దూకుడుగా వ్యవహరిస్తూ తెలంగాణాకి ఇంకా అనేక ఐటి పరిశ్రమలని, దాని అనుబంధ సంస్థలని రప్పించగలుగుతున్నారు.
“ఏడాది క్రితం తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సింగిల్ విండో విధానం ద్వారా దరఖాస్తు చేసుకొన్న రెండు వారాలలోగా 1,691 కంపెనీలకు అనుమతులు మంజూరు చేసామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సుమారు 800 పైగా కంపెనీలు నిర్మాణాలు పూర్తి చేసుకొని ఉత్పత్తి దశకు చేరుకొన్నాయని తెలిపారు. ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు, రూ.1.36 వేల కోట్ల ఐటి ఉత్పత్తుల ఎగుమతులే లక్ష్యంగా నూతన ఐటి విధానం ప్రకటించారు.
దీనిలో మళ్ళీ నాలుగు ఉప-విధానాలున్నాయి. అవి 1. రూరల్ ఐటి. 2. ఇన్నోవేషన్. 3. గేమింగ్ అండ్ యానిమేషన్. 4. ఎలక్ట్రానిక్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్.
వీటిలో రూరల్ ఐటి విధానం ద్వారా రాష్ట్రంలోని అంతగా అభివృద్ధి చెందని జిల్లాలు, పట్టణాలు, గ్రామాలలో ఐటి పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి భారీగా ప్రోత్సాహకాలు ఉంటాయి. తద్వారా ఐటి పరిశ్రమ హైదరాబాద్ చుట్టుపక్కలే కేంద్రీకృతం కాకుండా రాష్ట్రమంతటా కూడా విస్తరిస్తుంది కనుక ఆయా ప్రాంతాలలో నివసించే ప్రజలు కూడా దాని వలన లబ్ది పొందుతారు. ఇది ఒక దెబ్బకు రెండు పిట్టలు కొట్టే ఉద్దేశ్యమేనని చెప్పవచ్చును. ఐటి పరిశ్రమను రాష్ట్రమంతటికీ సమాంతరంగా వ్యాపింపజేస్తూనే, తద్వారా గ్రామీణాభివృద్ధిని సాధించడం దీని లక్ష్యంగా కనబడుతోంది.
ఇన్నోవేషన్ విధానంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తగిన ప్రోత్సాహం అందించి, ఐటి రంగంలో కొత్త వ్యాపారావకాశాలను సృష్టించే ప్రయత్నాలు జరుగుతాయి. మూడు, నాలుగవ విధానాల ద్వారా ఆయా రంగాల అభివృద్ధికి అవసరమయిన అన్ని రకాల సహాయసహకారాలను ప్రభుత్వం అందిస్తుంది. గత ఏడాది తెలంగాణా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఐ-పాస్ వంటి విధానాలు విజయవంతమయ్యి సత్ఫలితాలు ఇస్తున్నట్లే, ఇవ్వాళ్ళ ప్రకటించిన నూతన ఐటి విధానం కూడా సత్ఫలితాలు సాధించగలిగితే, ముఖ్యమంత్రి కేసీఆర్ చెపుతున్నట్లుగా తెలంగాణా రాష్ట్రం ఐటి రంగంలో దేశంలో నెంబర్: 1 స్థానంలో నిలవడం ఖాయం.