ఒక్క దెబ్బకు ఎన్నో పిట్టలు. సౌదీ అరేబియా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నో విజయాల సాధనకు లైన్ క్లియర్ చేశారు. ఇందులో ఆర్థిక కోణం ఉంది. దౌత్య వ్యూహం ఉంది. సౌదీ అరేబియా గల్ఫ్ లో ఓ సుసంపన్న దేశం సౌదీ అరేబియా . అపారమైన చమురు నిక్షేపాలతో తులతూగే పెట్రోడాలర్ల గని. భారత్ కు అత్యధికంగా చమురు సరఫరా చేసే ఎగుమతిదారు. లక్షల మంది భారతీయ కార్మికులకు పని కల్పించే ఉఫాధి వనరు. అలాంటి దేశంతో సన్నిహిత సంబంధాల కోసం ఇప్పటి వరకూ భారత్ తరఫున పెద్దగా ప్రయత్నం జరగలేదు. మోడీ మాత్రం సరైన వ్యూహంతో సౌదీతో దోస్తీకి సై అన్నారు. మోడీ సౌదీ చాణక్య నీతిని దేశ విదేశాల్లోని విమర్శకులు కూడా ప్రశంసిస్తున్నారు.
సౌదీ రాజు, యువరాజుతో మోడీ భేటీ వల్ల ఆర్థికంగా భారీ ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు దారుణంగా పడిపోయాయి. కాబట్టి చమురు ఎగుమతుల ద్వారా సౌదీ ఆదాయం కూడా తగ్గింది. ఇప్పుడు కొత్త మార్గంలో ఆదాయాన్ని పెంచుకోవాల్సి ఉంది. కొత్త వ్యాపారాలు, కొత్త ఆలోచనలతో కొత్త పుంతలు తొక్కాల్సి ఉంది. సౌదీ యువరాజు ఇప్పటికే ఈ విషయాన్ని గుర్తించారు. అందుకే, 2 ట్రిలియన్ డాలర్ల ఇన్వెస్ట్ మెంట్ నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించారు. ఒక ట్రిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో 66 లక్షల కోట్ల రూపాయలకు పైమాటే. ఈ లెక్కన ఈ నిధి ఎంత భారీ మొత్తంలో ఉంటుందో అర్థమవుతుంది. ఇందులోంచి వీలైనంత మొత్తాన్ని భారత్ లో పెట్టుబడికి రాబట్టాలనేది మోడీ అసలైన వ్యూహం.
విదేశాల్లో పెట్టుబడులు పెట్టే వారు కొన్ని విషయాలను సీరియస్ గా గమనిస్తారు. ఆ దేశంలో సహజ వనరులు ఉండాలి. మౌలిక సదుపాయాలు, నైపుణ్యం గల మానవ వనరులు, రాజకీయ స్థిరత్వం ఉండాలి. శాంతిభద్రతలు సాఫీగా ఉండాలి. గతంలో ఇవే కారణాలతో పలు దేశాలు చైనాలో పెట్టుబడులు పెట్టాయి. ఇప్పుడు చైనాలో సీన్ రివర్స్ అయింది. కొన్ని దేశాలు బ్రెజిల్ లో పెట్టుబడులు పెట్టేవి. అక్కడా పరిస్థితి సరిగా లేదు. భారత్ మాత్రం వేగంగా వృద్ధి చెందుతోంది. సహజ వనరులు, నైపుణ్యంగల మానవ వనరులు అపారంగా ఉన్నాయి. రాజకీయ స్థిరత్వం ఉంది. మోడీ ప్రధాని అయిన తర్వాత భారత్ ఓ బలమైన దేశమనే గుర్తింపు వచ్చింది. శాంతి భద్రతలు భద్రంగా ఉన్నాయి. ఇలా, ఏరకంగా చూసినా సాటి ముస్లిం దేశం పాకిస్తాన్ కంటే భారత్ కొన్ని వందల రెట్లు మెరుగైన దేశమని సౌదీకి తెలుసు. కాబట్టి, మేకిన్ ఇండియాలో భాగంగా పెట్టుబడులకు అవకాశం ఉంది. సౌదీలోని సంపన్న పారిశ్రామిక వేత్తలతోనూ మోడీ భేటీ అయ్యారు. వారిలో కూడా కొందరు పెట్టుబడులకు ముందుకు రావచ్చు. అదే జరిగితే, మేకిన్ ఇండియా సక్సెస్ కావచ్చు. వేల మంది యువతకు ఉపాధి లభించ వచ్చు.
భారత్ సత్తా ఏమిటో తెలిసిన దేశం సౌదీ. అమెరికాకు అత్యంత మిత్ర దేశం. ఆ విధంగా దౌత్య బంధం బలపడితే మనకు బహుళ ప్రయోజనాలు. ఈ విషయం ఇప్పటికే రుజువైంది. ప్రధాని మోడీ అణు భద్రత సదస్సు కోసం మొన్న వాషింగ్టన్ వెళ్లడానికి ముందు రోజే ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా, సౌదీ అరేబియాలు ఆరు తీవ్ర సంస్థలకు నిధులు సమకూర్చకుండా గట్టి ఆంక్షలు విధించాయి. భారత్ లో ఉగ్రదాడులు చేసే లష్కరే తయిబా కూడా వీటిలో ఉంది. దానికి పాకిస్తాన్ మద్దతు ఉందనేది బహిరంగ రహస్యం. అయినా, సౌదీ ఈ నిర్ణయం తీసుకోవడం, సాటి ముస్లిం దేశమైన పాకిస్తాన్ కు గట్టి హెచ్చరిక. ఒక రకంగా ఇది భారత్ కు విజయంగా భావిస్తున్నారు.
పాకిస్తాన్ కు మిత్రదేశమైన సౌదీతో సంబంధాలు బడపడితే అంతర్జాతీయంగా మన బలం పెరుగుతుంది. ఉగ్రవాదంపై పోరుకు మరింత మద్దతు లభిస్తుంది. పాకిస్తాన్ పై ఒత్తిడి పెరుగుతుంది. బలమైన ముస్లిం దేశమే మన వాదనకు మద్దతుగా నిలవడం పాకిస్తాన్ కు మింగుడు పడని విషయం. పరోక్షంగా అప్పుడప్పుడూ పాక్ కు ఇలాంటి షాకులివ్వడం కూడా అవసరమే.
మోడీ పర్యటనలో మరో కోణం కూడా ఉంది. సుమారు 35 లక్షల మంది భారతీయ కార్మికులు, ఉద్యోగులు సౌదీలో పనిచేస్తున్నారు. తరచూ చాలా మది వీసా వివాదాలు, ఇతర సమస్యల్లో ఇరుక్కుంటారు. ఆ దేశంలో బలమైన స్నేహ బంధం ఉంటే మన వాళ్ల క్షేమం విషయంలోనూ మేలే. ఇలా, బహుళ ప్రయోజనాల కోసం మోడీ వ్యూహాత్మకంగా సౌదీలో పర్యటించారు. తన విదేశీ పర్యటనలపై విపక్షాలు విమర్శలు చేస్తున్నా తన పని తాను చేసుకుపోతున్నారు. తాజా పర్యటన కూడా అందులో భాగం కావడం విశేషం.