“తెలుగు ప్రజలు అల్ప సంతోషులు…తమ గురించి ఎవరయినా రెండు మంచి ముక్కలు మాట్లాడితే చాలు అవతలి వాళ్ళ తప్పులన్నిటినీ క్షమించేస్తారు..” అని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ భావిస్తున్నారేమో తెలియదు కానీ ఏనాడూ తెలుగు రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడని ఆయన ఈరోజు ఇద్దరు ముఖ్యమంత్రులను ప్రశంశల వర్షం కురిపించారు.
సోమవారం నుంచి వారం రోజుల పాటు డిల్లీలోని విగ్యాన్ భవన్ లో నీటి వనరులపై చర్చా సదస్సులో అరుణ్ జైట్లీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టిసీమ ప్రాజెక్టుతో నదుల అనుసంధానం చేయడం చాలా గొప్ప విషయమని అభిప్రాయపడ్డారు. దాని ద్వారా తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న రాయలసీమ ప్రాంతం మళ్ళీ పచ్చగా కళకళలాడుతుందని తను ఆశిస్తున్నట్లు చెప్పారు. ఆలాగే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరధ, కాకతీయ వంటి ప్రాజెక్టులను చేపట్టినందుకు ప్రశంసించారు. వాటి ద్వారా రాష్ట్రంలో ప్రజలందరికీ త్రాగునీరు, రైతులకు సాగునీరు అందించాలని ప్రయత్నించడం హర్షనీయమని జైట్లీ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకి ఏమాత్రం తీసిపోని విధంగా భారీ ఆర్ధిక ప్యాకేజి మంజూరు చేస్తానని ఆయన స్వయంగా ప్రకటించారు. ఆ మాట చెప్పి ఏడాదిపైనే అయ్యింది. దానిపై 14వ ఆర్ధిక సంఘం ఆరేడు నెలలు కసరత్తు చేసి ఆంధ్రప్రదేశ్ ఇవ్వాల్సిన ప్యాకేజి గురించి వివరిస్తూ తయారుచేసిన ఒక ఫైలును ప్రధాని నరేంద్ర మోడి ఆమోదం కోసం పంపి చాలా కాలామే అయ్యింది. దాని గురించి మోడీ కానీ అరుణ్ జైట్లీ గానీ ఎన్నడూ మాట్లాడరు. రెవెన్యూ లోటు భర్తీ విషయంలో చంద్రబాబు నాయుడు అసంతృప్తి ప్రకటించినా దానిపై అరుణ్ జైట్లీ స్పందించరు.
రెండు తెలుగు రాష్ట్రాలకు వివిధ పద్దుల క్రింద ఆర్ధిక శాఖ చాలా నిధులు విడుదల చేయవలసి ఉంది. రెండు రాష్ట్రాలలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి తగినన్ని నిధులు విడుదల చేయవలసి ఉంది. దాని గురించి ఆయన ఎన్నడూ మాట్లాడరు. కానీ ఈవిధంగా ముఖ్యమంత్రులపై ప్రశంసలు కురిపించి వారిని మరిపించవచ్చని ఆయన భావిస్తున్నట్లున్నారు.