అవును. భారత్ కి అత్యంత కీలకమయిన, భౌగోళికంగా చాలా వ్యూహత్మకమయిన ప్రదేశంలో ఉన్న పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై భారతదేశమే స్వయంగా దాడులు చేసుకొని ఉండవచ్చని ఇటీవల పఠాన్ కోట్ లో దర్యాప్తుకి వచ్చిన పాకిస్తాన్ దర్యాప్తు బృందం (జిట్)లో అధికారి ఒకరు ‘పాకిస్తాన్ టుడే’ అనే పత్రికకు చెప్పినట్లు పాక్ మీడియాలో వార్తలు వచ్చేయి.
జిట్ అధికారి పాక్ మీడియాకి ఏమని చెప్పారంటే “అంతర్జాతీయంగా పాకిస్తాన్ని అప్రదిష్టపాలు చేసేందుకే భారత్ స్వయంగా పఠాన్ కోట్ పై దాడులు చేయించుకొని ఉండవచ్చును. ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించేందుకే పఠాన్ కోట్ లో కొన్ని గంటల వ్యవధిలో పూర్తి కావలసిన మిలటరీ ఆపరేషన్ని భారత ప్రభుత్వం తాపీగా మూడు రోజులపాటు కొనసాగించి ఉండవచ్చును. మేము (పాక్ దర్యాప్తు బృందం) భారత్ పర్యటనకి వెళ్లినప్పుడు అడిగిన కొన్ని ప్రశ్నలకు భారత నిఘా సంస్థ ఎన్.ఐ.ఏ. అధికారులు, పఠాన్ కోట్ లో సాక్షులు సంతృప్తికరమయిన జవాబులు చెప్పలేకపోయారు. పఠాన్ కోట్ పై దాడి చేసిన ఉగ్రవాదులు అసలు పాకిస్తాన్ నుంచే వచ్చినట్లు, ఎన్.ఐ.ఏ. బలమయిన ఆధారాలు చూపించలేకపోయారు. భారత్ లో కొన్ని శక్తులకు ఈ రహస్యాలు బయటపడటం ఇష్టం లేదు. అందుకే జిట్ బృందం పఠాన్ కోట్ లో దర్యాప్తు చేసి వెళ్ళిపోయిన తరువాత, ఈ కేసుపై చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్న ఎన్.ఐ.ఏ. అధికారి తంజిల్ అహ్మద్ హత్య చేయబడ్డారని అనుమానం కలుగుతోంది. అతని హత్య కూడా భారత్ కుట్రలో భాగమే కావచ్చును,” అని సదరు అధికారి పాకిస్తాన్ టుడే కి చెప్పినట్లు పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
జిట్ బృందం తమ దర్యాప్తు వివరాల నివేదికను త్వరలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కి అందజేస్తుంది. అది చేతికి వచ్చిన తరువాతః పాక్ ప్రభుత్వం పఠాన్ కోట్ దాడులపై తమ ప్రభుత్వ అభిప్రాయాన్ని అధికారికంగా ప్రకటించవచ్చును.
పఠాన్ కోట్ దాడుల నింద నుంచి ఏవిధంగా తప్పించుకోవాలా అని పాక్ ప్రభుత్వం మొదటి నుంచి ప్రయత్నిస్తూనే ఉంది. అందుకే నాలుగు నెలలయినా నిందితులెవరినీ అరెస్ట్ చేయకుండా దర్యాప్తు పేరిట కాలక్షేపం చేస్తోంది. ఆ కాలక్షేపంలో భాగంగానే జిట్ బృందం డిల్లీ, పఠాన్ కోట్ కూడా వచ్చి వెళ్ళింది. కొండను త్రవ్వి ఎలుకని పట్టినట్లు, నాలుగు నెలలు కాలక్షేపం చేసిన తరువాత అది చెపుతున్నదేమిటంటే భారత్ వైమానిక స్థావరంపై భారతే స్వయంగా దాడులు చేసుకొని, అక్కడ కాపలాగా ఉన్న తన సైనికులను కూడా అదే చంపించుకొంది. చివరికి ఎన్.ఐ.ఏ. అధికారిని కూడా హత్య చేసుకొంది. ఇదంతా దేనికి అంటే ప్రపంచ దేశాల దృష్టిలో పాకిస్తాన్ పరువు తీయడానికేనట! ఎంత విడ్డూరంగా ఉంది?
జిట్ బృందం నివేదిక అందిన తరువాత ఒకవేళ పాక్ ప్రభుత్వం కూడా ఇవే అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లయితే, ఈ కేసు నుంచి తప్పించుకోవడానికే పాక్ ప్రభుత్వం ‘జిట్’ అనే ఆ కవచాన్ని ఏర్పాటు చేసుకొందని భావించవలసి ఉంటుంది. భారత్ పై తిరిగి ఎదురుదాడి చేయడానికే కుల్భూషన్ యాదవ్ అనే మాజీ నేవీ అధికారిని అరెస్ట్ చేసినట్లు చూపించి, పాకిస్తాన్ని విచ్చిన్నం చేయడానికి భారత్ ప్రయత్నోస్తోందని అతని చేత వీడియో స్టేట్ మెంట్ సిద్దం చేసి ఉంచుకొందని అనుమానించవలసి ఉంటుంది.
తాము ఉగ్రవాదంపై పోరాడుతున్నామని, కానీ తాము కూడా ఉగ్రవాద బాదితులమేనని చెప్పుకొనే పాకిస్తాన్, పఠాన్ కోట్ దాడుల దర్యాప్తు విషయంలో కనబరుస్తున్న వైఖరి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఉగ్రవాదులలో, మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉండరని చెప్పుకొంటూనే పఠాన్ కోట్ పై దాడులకు కుట్రలు పన్నినట్లు అనుమానిస్తున్న జైష్ –ఏ-మహమ్మద్ అధినేత మౌలానా మసూద్ అజహర్ కి రక్షణ, అవసరమయిన సహాయ సహకారాలు అందిస్తోంది. అంతర్గత ఒత్తిళ్ళ కారణంగా పాక్ ప్రభుత్వం ఉగ్రవాదం పట్ల ఇటువంటి ద్వంద వైఖరి అవలంభిస్తుండవచ్చును. కానీ దాని వలన అదే ఎక్కువ నష్టపోవలసి వస్తుందనే సంగతి విస్మరిస్తోంది.