రాజకీయ పార్టీలు దేశంలో ఎక్కడ నుంచయినా పోటీ చేయవచ్చును. అందుకు ఎవరూ అభ్యంతరం చెప్ప(లే)రు కానీ దాని కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలనుకొంటే నిరసించక తప్పదు. ఇది అక్షరాల మజ్లీస్ పార్టీకి వర్తిస్తుంది. మజ్లీస్ పార్టీ ప్రధానంగా ముస్లిం ప్రజల ఓట్లపైనే ఆధారపడి మనుగడ సాగిస్తోంది. కనుక ముస్లిం ప్రజల సమస్యలు, వాటి పరిష్కారం గురించి మాట్లాడితే ప్రజలందరూ హర్షించేవారు కానీ ఓవైసీ సోదరులిద్దరూ ముస్లిం ప్రజలను ఆకట్టుకొని వారి ఓట్లు కొల్లగొట్టడానికి ప్రశాంతంగా జీవిస్తున్న హిందూ, ముస్లిం ప్రజలను రెచ్చగొట్టేవిధంగా రాజకీయ ప్రసంగాలు చేస్తుంటారు. వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎన్నికలలో పోటీ చేయాలనుకొన్నా వారిది ఇదే విధానంగా ఉంటోంది.
మహారాష్ట్ర, బిహార్ లలో వారు సృష్టించిన అలజడి గురించి అందరికీ తెలుసు. ఈసారి తమిళనాడుకి కూడా తన పార్టీని విస్తరించాలనే ఆలోచనతో అక్కడ చెపాక్, వాణియంబాడి ,కృష్ణగిరి మూడు నియోజక వర్గాలలో మజ్లీస్ అభ్యర్ధులను నిలబెడుతున్నట్లు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ నిన్న ప్రకటించారు. కనుక త్వరలో ఒవైసీ సోదరులిద్దరూ తమ పార్టీ అభ్యర్ధుల తరపున ఆ మూడు ప్రాంతాలలో ప్రచారం చేయడం కూడా ఖాయమే. అలాగే మళ్ళీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయడం కూడా ఖాయమేనని భావించవచ్చును.
ప్రతీ ఎన్నికలలో మజ్లీస్ పార్టీ అభ్యర్ధులను నిలబెట్టి పోటీ చేసి ఓడిపోతున్నప్పటికీ, ఆ విధంగానయినా మజ్లీస్ పార్టీ అనేది ఒకటి ఉందని దేశ ప్రజలందరికీ తెలిసివచ్చేలా చేయగలుగుతున్నారు ఒవైసీ సోదరులు. అయితే వారు ప్రజలలో మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా ముస్లిం ప్రజలలో అభద్రతాభావం కల్పించి వారి ఓట్లు పొందాలని ఆలోచించడం కంటే వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడి, వాటి పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేసినట్లయితే ముస్లిం ప్రజలు మజ్లీస్ పార్టీని ఆదరించవచ్చును. కానీ రెండవ దానికంటే మొదటితే చాలా తేలిక కనుక ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఏదో ఒకటి మాట్లాడి ఓట్లు పొందాలని ఒవైసీ సోదరులు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు.