తమిళనాడులో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అందరి దృష్టి సూపర్ స్టార్ రజినీకాంత్ వైపు మళ్ళుతుంటుంది. ఏదో ఒకనాడు తను రాజకీయాలలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా ఆయన మాట్లాడటమే అందుకు కారణం. సినిమాలలో రాజకీయాలను తమకు నచ్చినట్లు మలుచుకోవచ్చును కానీ నిజజీవితంలో అది సాధ్యం కాదు. పూర్తిగా పతనమయిన రాజకీయాలలో తను ఇమడలేనని, ఇమిడినా వాటిని ప్రక్షాళనం చేయడం తన వలన సాధ్యం కాదనే సంగతి బహుశః రజనీకాంత్ కూడా గ్రహించేఉంటారు. అందుకే ప్రతీసారి కూడా ‘భగవంతుడి నుంచి ఇంకా ఆదేశం రాలేదు’ అంటూ తన నిర్ణయాన్ని వాయిదా వేసుకొంటున్నారు. తమిళనాడులో మళ్ళీ మే 16న శాసనసభ ఎన్నికలు జరుగుతున్నందున మళ్ళీ అందరి దృష్టి ఆయనపైనే పడింది. ఈ ఎన్నికలలో ఆయన ఒంటరిగా పోటీ చేస్తున్న భాజపాకి మద్దతు ఇస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. కానీ ఆయన ఈసారి కూడా ప్రత్యక్ష రాజకీయాలలోకి రావడం లేదని ఆయన సోదరుడు సత్యనారాయణ మీడియాకి స్పష్టం చేసారు. “రజనీకాంత్ ఏదో ఒక పార్టీకో, వర్గానికో పరిమితం కావాలనుకోవడం లేదు. తమిళనాడు ప్రజలందరూ తనకు కావాలని ఆయన కోరుకొంటున్నారు. అలాగే ఆయన అభిమానులు కూడా ఆయన ఏదో ఒక పార్టీకి పరిమితమయ్యి తమకు దూరం కాకూడదని కోరుకొంటున్నారు. తన రాష్ట్రం, ప్రజలు బాగుండాలని నా సోదరుడు రజనీకాంత్ కోరుకొంటున్నారు. ప్రజలకి ఎవరికీ ఓట్లు వేయాలో బాగా తెలుసు. వారికి అన్ని విధాలా మేలు చేకూర్చేవారికే వారు ఓట్లు వేసి గెలిపించుకొంటారు. కనుక మధ్యలో నా సోదరుడు వచ్చి కలుగజేసుకోనవసరం లేదు. ప్రజలు తమకు నచ్చిన వారికే ఓట్లు వేసుకోవడం మంచిది. కనుక మీడియా వాళ్ళకి, రజనీ అభిమానులకి నేను చేసే విజ్ఞప్తి ఏమిటంటే ఆయనను ఈ రాజకీయ రొంపిలోకి లాగొద్దు,” అని రజనీ సోదరుడు సత్యనారాయణ కృష్ణగిరిలో మీడియా ప్రతినిధులకి చెప్పారు.
అంటే ఈసారి ఎన్నికలలో కూడా రజనీకాంత్ ప్రత్యక్ష రాజకీయాలలోకి రారని స్పష్టం అయిపోయింది. ఇప్పటికే ఆయన వయోభారం చేత తరచూ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు కనుక, ఈసారి రాజకీయాలలో రానట్లయితే ఆయన ఇంకెప్పుడు రాజకీయాలలోకి రాకపోవచ్చును.