తెలుగు మీడియా ఎంతగా రాజకీయ రంగు పులుముకుందంటే ఫలానా పార్టీకి సంబందించిన వార్త ఫలానా పత్రికలో వస్తే నిజమేనని అంటున్నారు. లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని చాలా కాలంగా వినిపిస్తున్న మాటే. అయితే మంగళవారం నాడు ఆంధ్రజ్యోతిలో ఆ వార్త వచ్చింది గనక ఇక అధికారికమేనని మీడియా వర్గాలు కూడా బుల్లి తెరపైనే వ్యాఖ్యానించడం ఆసక్తికరం.
ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడితే ‘మీ గజిట్ పేపరే’ అని అంటుంటారు గాని ఇప్పుడు మిగిలిన వారు కూడా అనే పరిస్థితి వచ్చింది. ఆ పత్రికలో ఆర్కె రాసిన వ్యాఖ్యానాన్ని చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు పోటీపడి ప్రశంసించడంతో మరీ రెచ్చిపోతున్నారని బిజెపి నాయకులు అంటున్నారు. ఏదైనా దాంట్లో టిడిపికి అనుకూలంగా రాసి తమను బద్నాం చేస్తున్నారనే కోపం కూడా బిజెపి వర్గాల్లో వుంది.
ఇది ఇలా వుంటే ఆ పత్రికాధిపతిని రాజ్యసభకు పంపిస్తారనే వదంతి ఒకటి చలామణిలో వుంది. కాని ఆయన స్వభావం ఆలోచనలు మాటలు తెలిసిన వారెవరూ అలా అనుకోవడం లేదు. “కింగ్ మేకర్‌గా తప్ప కింగ్‌లా వుండటం మా బాస్‌కు అస్సలు పడదు” అని ఆయనకు సన్నిహితంగా వుండే సంస్థ ముఖ్య బాధ్యులొకరు అన్నారు. గతంలో నార్లవెంకటేశ్వరరావు, డక్కన్ క్రానికల్ వెంకట్రామిరెడ్డి, వార్త గిరీష్ సంఘ్వీ వంటివారు రాజ్యసభకు వెళ్లిన మాట నిజమే గాని తమ బాస్ అలాటివి పెట్టుకోరని సన్నిహితులు చెబుతున్నారు.