సాధారణంగా తెరాసలో కీలక నాయకులు అందరూ మంచి వక్తలు కావడం ఆ పార్టీకి ఉన్న బలాల్లో ఒకటి. కేసీఆర్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గొప్ప వక్తల్లో ఒకడు. అలాగే తెరాస నాయకులు చాలా మంది విషయాన్ని చక్కగా ప్రజెంట్ చేయడంలో ఆరితేరిన నాయకులే. తమ రాజకీయ ప్రత్యర్థులను నిశిత విమర్శలతో చీల్చిచెండాడంలోనూ వారిని మించిన వారు లేరు. అయితే తాజా పరిణామాల్లో కేసీఆర్ మీద ఈగ వాలినా వెంటనే ఎదురుదాడులకు దిగుతూ ఉండే ఆయన తనయుడు మంత్రి కేటీఆర్.. చాలా పేలవమైన ప్రతివిమర్శలతో ఓ ప్రెస్‌మీట్ పెట్టి మరీ .. తమ ప్రభుత్వ బలహీనతలు దొరికిపోయేలా మాట్లాడడం పలువురికి ఆశ్చర్యం కలిగిస్తోంది. చూడబోతే.. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్కల్పిస్తాం అనే హామీకి సంబంధించి కేసీఆర్ సర్కారు ఇప్పటిదాకా పట్టించుకోకపోవడం అనే అంశం మీద ముస్లింల్లో సంతకాల సేకరణ చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఉద్యమానికి కేటీఆర్‌లో ఒకింత కంగారు పుట్టినట్లుగా కనిపిస్తోంది.
సార్వత్రిక ఎన్నికల సమయంలో ముస్లిం ఓటు బ్యాంకును ఆకర్షించడానికి కేసీఆర్ ప్రయోగించిన బ్రహ్మాస్త్రాల్లో 12 శాతం రిజర్వేషన్ కూడా ఒకటి. అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల మీద ప్రభుత్వం పెడుతున్న శ్రద్ధ ఇలాంటి సామాజిక సమతుల్యతకు సంబంధించిన హామీలపై పెట్టడం లేదు. ఈ రిజర్వేషన్ గురించి పట్టించుకోనూ లేదు. కాంగ్రెస్ సర్కారును విమర్శించే ప్రతిసారీ ఈ పాయింటు కూడా తెరపైకి తెస్తుంటుంది.
అయితే తాజాగా ఉత్తంకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో మరో అడుగు ముందుకేసి ముస్లింలతో రిజర్వేషన్ హామీపై సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టింది. దీనిపై కేటీఆర్ మంగళవారం ప్రెస్మీట్లో ఫైర్ అయిపోయారు. తాము 5 శాతం ఇస్తాం అని చెప్పిన కాంగ్రెస్ 4 శాతానికి పరిమితం అయిందని, ఉత్తంకుమార్ ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకోవడానికి ఇప్పుడు సంతకాల సేకరణ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. పైగా కేసీఆర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌కు కాంగ్రెస్ గైర్హాజరవడాన్ని కూడా ఇప్పుడు ప్రస్తావించి పారిపోయారంటూ పాత విమర్శలే గుప్పించారు. ఇంత లావు ప్రసంగం చేశారు గానీ.. సూటిగా కాంగ్రెస్ చేపట్టిన ఉద్యమానికి జవాబుగా రిజర్వేషన్ విషయంలో తమ ప్రభుత్వం ఏం చేయబోతున్నది అనే సంగతి మాత్రం కేటీఆర్ చెప్పకపోవడం విశేషం అదే సమయంలో ముస్లింల సంక్షేమానికి తమ సర్కారు కట్టుబడి ఉంటుందని ఓ స్టేట్మెంట్ మాత్రం ఇచ్చేశారు.
మరో కామెడీ ఏంటంటే.. కేసీఆర్‌కు ఉన్నంతటి భాషా సంపత్తి కాంగ్రెస్ లో ఏ నాయకుడికైనా ఉందా? అంటూ కేటీఆర్ కాంగ్రెస్ నాయకులను నిలదీయడం విశేషం. అయితే, కేసీఆర్ భాషాసంపత్తి విషయంలో ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలూ లేవు. ఆయనకు ఆ విషయంలో తిరుగులేదు. అయితే భాషాసంపదకు పరిపాలన దక్షతకు లింకేమిటి అనేది మాత్రం అర్థం కాని సంగతి. కేటీఆర్ మాటలు విన్నవారికి కాంగ్రెస్ వారి ఉద్యమం వలన పుట్టిన కంగారులో ఆయన ఏదో మాట్లాడబోయి.. ఏదేదో మాట్లాడేసి గందరగోళంలో పడ్డారని మనకు అనిపిస్తుంది.