మల్టీస్టారర్ సినిమాల్లో స్టార్ హీరోలు నటించడానికి ముందుకు రాని సమయంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో ఓ సరికొత్త సంప్రదాయానికి తెర లేపాడు మహేష్‌బాబు. ఎలాంటి ఈగోలకూ పోకుండా ఓ కథని నమ్మి మహేష్, వెంకీలు చేసిన ఆ ప్రయత్నం తెలుగునాట ఓ సరికొత్త ట్రెండ్‌కి నాంది పలికింది. మహేష్ ఇప్పటికీ మల్టీస్టారర్ కథల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. అయితే అలాంటి కథలతో మహేష్‌ని ఒప్పించే దర్శకులే కనిపించడం లేదు. ఇప్పుడు తమిళ దర్శకుడు మురుగదాస్ ఆ లోటు తీర్చాడని టాక్. మహేష్ – మురుగదాస్ కలయికలో ఓ చిత్రం తెరకెక్కనుంది. అది మల్టీస్టారర్ సినిమానే అని టాక్.
అవును.. మహేష్ సినిమాలో మరో హీరోకీ ఛాన్స్ ఉందట. ఓ పేరున్న కథానాయకుడు కీలకమైన పాత్రలో కనిపిస్తాడట. ఆ ఛాన్స్… తమిళ స్టార్ హీరో విజయ్‌కి దక్కిందని సమాచారం. మురుగదాస్ – విజయ్‌ల కాంబినేషన్ సూపర్ హిట్. వీరిద్దరి కలయికలో వచ్చిన తుపాకి, కత్తి సినిమాలు బాక్సాఫీసుని షేక్ చేశాయి. దాంతో మురుగదాస్ – విజయ్ ల మధ్య చక్కటి బాండింగ్ కుదిరింది. మహేష్‌తో తీస్తున్న సినిమాని తమిళంలోనూ భారీగా విడుదల చేయాలన్నది మురుగదాస్ ఆలోచన. తమిళంలోనూ ఈ సినిమాకి క్రేజ్ రావాలంటే ఓ తమిళ హీరో సపోర్ట్ తీసుకోవాలని భావించాడట. అందుకే ఓ కీలకమైన పాత్ర విజయ్‌కి అప్పగించాడని తెలుస్తోంది. విజయ్ కూడా అందుకు ఒప్పుకోవడంతో ఈ సినిమా మల్టీస్టారర్‌గా రూపాంతరం చెందబోతోంది. అయితే తెలుగులోనూ విజయే కనిపిస్తాడా, లేదంటే… ఇక్కడి కథానాయకుడు ఆ పాత్రలో కనిపిస్తాడా? విజయ్‌ని తమిళంకే పరిమితం చేస్తారా? అనే విషయాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.