రాజకీయాల్లో నాయకులు చేసుకునే విమర్శలు ప్రతి విమర్శల పట్ల మనలో ఒక రకమైన జడత్వం పేరుకుపోయి ఉంటుంది. జగన్ చంద్రబాబులు పరస్పరం ఎలాంటి విమర్శలు, ఎలాంటి ఆరోపణలు చేసుకున్నప్పటికీ.. తటస్తులు వాటిని సీరియస్గా పట్టించుకోకుండా నిర్లిప్తంగా ఉండిపోయే పరిస్థితి నేడు ఉంది. ఆయా నాయకులు అభిమానులు మురిసిపోవడమూ, మండిపోవడమూ జరుగుతుందే తప్ప.. వాస్తవంలో తటస్తులు స్పందించేం సీనుండదు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విషయానికి వస్తే.. ప్రధాని మోడీ మీద ఆయన చేసే విమర్శలు కూడా ప్రజల్లో ఇలాంటి జడత్వాన్నే నింపాయి. మోడీ ఏం చేసినా కేజ్రీ విమర్శిస్తూనే ఉంటార్లే అని జనం అనుకునే పరిస్థితి.
కానీ పఠాన్కోట్ ఉగ్రవాద చర్యలు, దాని మీద దర్యాప్తుకు పాకిస్తాన్ టీంను అనుమతించడం అనే వ్యవహారాలకు సంబంధించి ట్వీట్ ద్వారా కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు మాత్రం యావత్ భారతదేశంలోని తటస్తుల, సాధారణ పౌరుల మనోభావాలను ప్రతింబించేలా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. పఠాన్కోట్ దాడి సంగతి మనకు తెలుసు. దీనిపై పాకిస్తాన్ టీం వచ్చి దర్యాప్తు చేసి వెళ్లిన సంగతి కూడా మనకు తెలుసు. ఈ పాక్ టీం ను ఇండియాలో దర్యాప్తుకు అనుమతించడాన్ని అనేకమంది వ్యతిరేకించారు. చరిత్రలో ఎప్పుడు ఇతర దేశపు దర్యాప్తు సంస్థను ఇక్కడకు అనుమతించడం జరగలేదని వాదించారు. కానీ మోడీ సర్కార్ మొండిగా ఆ పనిచేసింది. తీరా ఆ పాక్ టీం ‘జిట్’ వచ్చి వెళ్లాక, ఇంకా తమ పాక్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వకముందే.. వారి దర్యాప్తు సంగతులు అక్కడి పత్రికల్లో వచ్చేశాయి. దాడికి పాల్పడింది పాక్ కాదని, ఇండియానే అనే ప్రేలాపనలు నివేదికలో ఉన్నట్లు పత్రికలు రాశాయి.
ఈ పరిణామాలన్నీ మోడీ ప్రభుత్వం చేతగానితనం వల్ల జరిగిందని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. భారతమాతకు మోడీ వెన్నుపోటు పొడిచారని అభివర్ణించారు. పాక్ ముందు మన దేశాన్ని మోడీ అవమానానికి గురిచేసిన చర్య ఇది అని విమర్శించారు. పాక్ దర్యాప్తు బృందం ఇలాంటి వక్రమార్గాలకు తెగబడ్డాక, వారిని అనుమతించిన విషయంలో దేశ ప్రజల గుండెచప్పుడు కూడా అదే అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాలా?