నాయకుల రెండు నాల్కల ధోరణిని అనుభవంలో చూడడం ప్రజలకు కొత్త కాదు. కానీ ఏకంగా పార్టీ మొత్తం తమ విధానాల పరంగా పరస్పర విరుద్ధమైన రెండు నాల్కల ధోరణిని అవలంబించడం అనేది కాస్త చిరాగ్గా అనిపిస్తుంది. అదే సమయంలో, తమది సిద్ధాంతాలకు పెద్దపీట వేసే క్రమశిక్షణకు ఆలవాలమైన పార్టీ అని టముకు వేసుకునే భారతీయ జనతా పార్టీ వంటి వారు కూడా అవకాశవాదం పోత పోసినట్లు.. ఏ రోటికాడ ఆ పాట పాడుతూ.. ఎక్కడికక్కడ డైలాగులు మార్చేస్తూ.. దిగజారుడు రాజకీయ ధోరణులను ప్రదర్శిస్తే అసహ్యం కూడా కలుగుతుంది. ప్రస్తుతం అయిదు రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికల విషయంలో తమకు ఫలితాల మీద పెద్దగా ఆశ లేకపోయినప్పటికీ.. పరువుపోకుండా ఉండేందుకు ఎన్నికల బరిలో దిగిన భాజపా.. అనేక రకాల పరువు తక్కువ ప్రచారార్భాటాలకు దిగుతున్నట్లు విశ్లేషణలు సాగుతున్నాయి.
ఈ అయిదు రాష్ట్రాలకు కలిపి అసోంపై తప్ప మరెక్కడా వారికి వీసమెత్తు ఆశ కూడా లేదు. ఆ అసోంలో.. కాంగ్రెస్ పార్టీ తమ ప్రచారంలో రెండేళ్లలో మోడీ ఏం చేశారో చెప్పాలి అంటూ నిలదీస్తే.. భాజపా అధ్యక్షుడు దానిని కూడా ఎద్దేవా చేస్తున్నారు. అసోం ప్రచారంలో సోనియా ఆ మేరకు ప్రశ్నించడాన్ని ఆయన గేలిచేస్తూ.. ”ఇక్కడ జరుగుతున్నది లోక్సభ ఎన్నికలు కాదు మేడం, అసెంబ్లీ ఎన్నికలు. ప్రధాని పనితీరుపై ఇప్పుడు ఎందుకు లెక్కచెప్పాలి.. 2019లో లెక్క చెబుతాం” అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ప్రశ్నించింది, ప్రతిపక్షానికి చెందిన సోనియా గనుక అమిత్షా చవకబారు శైలిలో ఎద్దేవా చేస్తున్నారు గానీ.. ఇదే ప్రశ్న ప్రజలదే అయితే ఏం సమాధానం చెబుతారు.
భాజపా నాయకులు ఏ రాష్ట్రంలో అడుగుపెట్టినా.. మోడీని ఓ దేవుడిగా ప్రచారం చేస్తూ ఓట్లు అడుక్కుంటారు. మోడీ పాలనకు మద్దతు ఇవ్వండి అంటూ ఓట్లయాచనకు దిగుతారు. మరి ”అడగడానికి” మోడీ పాలనే ప్రాతిపదిక అయినప్పుడు, ఆ సమయంలో మోడీ సాధించినదేమిటో లెక్కచెప్పడం కూడా అవసరమే కదా? అది మాత్రం 2019లో చెబుతాం అంటూ అమిత్షా అనడమే వారి పరువు తీస్తోంది.
అసోంలో అమిత్ ఇలా అంటోంటే.. ఇక్కడ తమిళనాడులో వెంకయ్య మాత్రం.. మోడీ పాలన కోసం భాజపాకు ఓట్లేయాలంటూ కోరుతున్నారు. అమ్మ, అయ్యల పాలన వద్దు భయ్యా పాలనకు కమలంకు ఓటేయండి అని ప్రచారం చేస్తున్నారు. ఓట్లు అడగడానికి మాత్రం మోడీ పాలన అంటారు.. సోనియా అడిగినట్లుగా లెక్క చెప్పాల్సి వస్తే మాత్రం.. ఇది పార్లమెంటు ఎన్నికలు కాదు కదా.. అని పలాయనం చిత్తగిస్తారు. భాజపా నేతలకు కూడా సిగ్గుమాలిన రాజకీయ ధోరణులు అలవాటైపోయాయని జనం అనుకుంటున్నారు.