నేను ఇప్పుడు మారినచంద్రబాబును అని ఆయన స్వయంగా చాలా సార్లు ప్రకటించుకున్నారు. ఎన్నికలకు ముందు నుంచి ఇలా తనలో వచ్చిన మార్పు గురించి ఆయన ప్రచారం చేసుకోవడం ముమ్మరంగానే జరిగింది. తాను మారినట్లుగా జనానికి ఒక నమ్మకం కలిగిస్తే తప్ప.. వారి విశ్వాసాన్ని చూరగొనడం సాధ్యం కాదని అప్పట్లో చంద్రబాబునాయుడు గుర్తించారు గనుకనే.. ఆ మాటను నినాదంగా స్వీకరించారు. అలాగే.. నాయకుడిగా తన ప్రాధాన్యాలు కూడా మార్చుకుంటూ.. ప్రజలు మెచ్చే వాటికి పెద్దపీట వేయాలనే ధోరణిని కూడా తన అలవాటుగా మార్చుకున్నారు. ఇదంతా పాత సంగతి.
అయితే పార్టీ అధినేతగా కూడా ఇప్పుడు ఆయన మారిన చంద్రబాబు అని నాయకుల వద్ద కితాబులు అందుకుంటున్నారు.
అంబేద్కర్, జగ్జీవన్ రాం వంటి నేత లస్థాయికి కొనకళ్ల నారాయణరావు కూడా ఎదగాలి అంటూ వ్యాఖ్యానించడం అంటే.. ఒక్కోసారి ఆయనను ఎద్దేవా చేస్తున్నారేమో అనిపిస్తుంది. కానీ ఆ మాట ఆయన జన్మదినం సందర్భంగా అన్నది అని తెలిసినప్పుడు.. సహజంగా చెప్పగల శుభాకాంక్షలు మాత్రమే అని సరిపెట్టుకోబుద్ధవుతుంది. మరి అంత పెద్ద కితాబుతో కొనకళ్ల బర్త్‌డే సందర్భంగా గ్రీట్ చేసింది చంద్రబాబే! ఆయన స్వయంగా తన పార్టీ ఎంపీతో కేక్ కట్ చేయించి.. కేకు ముక్కను ఆయనకు తినిపించి మరీ ఈ డైలాగు వల్లించారు.
అవును చంద్రబాబునాయుడు ఇప్పుడు మారిన మనిషి. గతంలో అయితే.. పార్టీ నిర్వహణను కూడా ఒక కార్పొరేట్ కంపెనీ ఎడ్మిన్ హెడ్‌లాగా చూస్తూ వచ్చిన చంద్రబాబునాయుడు ఇప్పుడు ఆ నిర్వహణలోనే కాస్త ఎమోషన్స్, అనుబంధాలు, ఆత్మీయతలు తదితర తాలింపులను జత చేస్తున్నారు. గతంలో జాతీయ నాయకులు వంటి వారి జయంతి వేడుకలను పార్టీ నిర్వహించినా.. చాలా అకడమిక్‌గా ఉండే ఉపన్యాసాలతో ఆ ఘట్టాలను ముగించేసే అలవాటున్న చంద్రబాబునాయుడు ఇప్పుడు, తన సొంత పార్టీ నాయకుల పుట్టిన రోజులు వచ్చినా.. పార్టీ ఆఫీసులో తనే స్వయంగా దగ్గరుండి సెలబ్రేట్ చేయిస్తూ.. పైన చెప్పుకున్న తరహా డైలాగుల్తో వారిని ఉత్సాహపరుస్తూ.. ఒక రకమైన సెలబ్రేటింగ్ మూడ్, కల్చర్‌ను పార్టీలోకి తీసుకువస్తున్నారు. చంద్రబాబు వైఖరిలో ఇది చాలా భిన్నంగా కనిపిస్తోంది అని సొంత పార్టీలోనే వినిపిస్తోంది.
ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడు బర్త్‌డేను కూడా చంద్రబాబు దగ్గరుండి చేయించారు. మరో మంత్రికి కూడా ఇలాంటి అపురూప అవకాశం దక్కింది. జగన్ బర్త్‌డే నాడు కూడా తనే స్వయంగా శాసనసభలో జగన్ సీటు వద్దకు వెళ్లి గ్రీటింగ్స్ చెప్పారు. తాజాగా కొనకళ్ల బర్త్‌డేను బెజవాడలో దగ్గరుండి సెలబ్రేట్ చేయించారు. ఇదంతా నాయకుడిలో వస్తున్న మంచి మార్పేనని పార్టీ శ్రేణులు ముచ్చటపడడంలో ఆశ్చర్యం ఏముంది?