వైఎస్ జగన్మోహనరెడ్డి అంటూ.. ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు. ఏనాటికైనా ముఖ్యమంత్రి అవుతానని నమ్ముతున్న వ్యక్తి. ఒక పెద్ద పార్టీకి అధినేత. తిరుగులేని ప్రజాదరణ ఉన్న ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడి కుమారుడు. తనను నమ్మిన అనుచర గణం పుష్కలంగా ఉన్న నాయకుడు. మరి ఆ స్థాయికి చేరుకున్న జగన్ అంటే.. ఆయన ‘తన’ అనుకునే వారికి నిత్యం విందులు ఇస్తూ, వారిని సంతుష్టులుగా ఉంచుతూ.. తనతో బంధం పదిలంగా ఉండేలా కాపాడుకుంటూ ఉంటారేమో అని మనం అనుకుంటాం. కానీ వాస్తవం ఒక్కోసారి మనల్ని నిర్ఘాంత పరుస్తుంది. తానే పార్టీ అధినేతగా ఎదిగి సుమారు ఆరేళ్లు గడుస్తుండగా.. జగన్ కడప జిల్లా పులివెందుల లోని తన నివాసంలో మొట్టమొదటిసారిగా జిల్లాలోని పార్టీ నాయకులకు విందు ఏర్పాటుచేశారు.
జగన్ స్థాయిలోని నాయకుడు పులివెందులలోని తన ఇంట్లో సొంత జిల్లా నాయకులకు విందు ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అంటే సాధారణంగా ఎవ్వరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. అందుకే ఆయన సొంత పార్టీలోని వారు కూడా.. తమ పార్టీ అధినేత ఇప్పుడు ‘మారిన జగన్’ లాగా కనిపిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేస్తుండడం కనిపిస్తోంది.
జగన్ ఎవ్వరితోనూ సన్నిహితంగా ఉండరని, ఎవ్వరినీ నమ్మరని, వ్యాపార బంధాలే తప్ప, ఆత్మీయ బంధాలు ఉండవని, ఇలా రకరకాలుగా ఆయనంటే కిట్టని వాళ్లు ప్రచారం చేస్తూ ఉంటారు. అందుకే బహుశా విందులు వంటి ఆత్మీయ భేటీలు ఆయన ప్రపంచంలో తక్కువ కావచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితుల్లో పార్టీ ని కాపాడుకోవడానికి జగన్ కొత్తగా విందుభేటీలకు అలవాటు అవుతున్నాడా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తన సొంత జిల్లానుంచి కూడా ఇంకా కొందరు వైకాపా ఎమ్మెల్యేలు తెదేపా వైపు చూస్తున్నట్లుగా పుకార్లు వస్తుండడం జగన్ను కంగారు పెట్టినట్లు ఉన్నదని, అందుకే అందరూ కలసి కట్టుగా ఉన్న సంకేతాలు ఇవ్వడంతో పాటూ.. అందరినీ మచ్చికచేసుకోవడానికి కొత్తగా ఇలాంటి విందులు ప్రారంభించాడని అంటున్నారు. ఇలాంటి ప్రచారానికి తగినట్లుగానే.. కడప జిల్లానుంచి తెదేపాలోకి వెళ్లిపోతారని ప్రచారం జరుగుతున్న ఇద్దరు ఎమ్మెల్యేలతో జగన్.. ఈ విందుకు ముందు విడివిడిగా కొద్దిసేపు భేటీ కావడం కూడా విశేషం. పార్టీని వీడిపోవద్దని, అలాంటి పుకార్లకు వారే ఫుల్స్టాప్ పెట్టాలని జగన్ కోరినట్లుగా చెప్పుకుంటున్నారు. మొత్తానికి విందుభేటీలు వంటి వాటికి జగన్ ట్యూన్ అవుతున్నారంటే మారినట్లే కదా అని జనం చెప్పుకుంటున్నారు.