ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్, వైకాపా నేతలు, ఎమ్మెల్యేలను తెదేపాలో చేర్చుకోవడానికి మొదట్లో తెదేపా చాలా ఆచితూచి వ్యవహరించేది. ఇతర పార్టీలలో వారిని పార్టీలో చేర్చుకొన్నట్లయితే పార్టీలో అసంతృప్తి, గొడవలు మొదలవుతాయనే భయంతో వెనుకంజ వేసేది. కానీ ఇప్పుడు వైకాపా నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు, నేతలు వచ్చినా అందరినీ చేర్చుకొంటామని చెపుతోంది. అంతే కాదు ఇప్పుడు వారి చేరిక వలన పార్టీలో ఎటువంటి అసంతృప్తి, ఆందోళన లేదని చెప్పడానికి ఒక మంచి బలమయిన కారణం కూడా వెతికి పట్టుకొని చూపిస్తోంది. అదేమిటంటే వచ్చే ఎన్నికల రాష్ట్రంలో 50 అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని, అలాగే ఎమ్మెల్సీలు, కార్పోరేషన్, కమిటీలు వంటివన్నీ కలిపి చూసుకొంటే కనీసం 300 పదవులు పంపకాలకి సిద్దంగా ఉన్నాయని వాదిస్తోంది. కనుక వైకాపా నుంచి పార్టీలో చేరుతున్న కొత్త వాళ్ళని చూసి పార్టీలో పాతవాళ్లు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, వైకాపా ఖాళీ అయ్యేవరకు కూడా ఆపరేషన్ ఆకర్ష కొనసాగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.ఈ.కృష్ణమూర్తి నిన్న కర్నూలులో ప్రకటించేశారు. అంతే కాదు పార్టీలో ఉన్నవారికే కాకుండా కొత్తగా వచ్చిన చేరుతున్న వారందరికీ కూడా పదవులు, వచ్చే ఎన్నికలలో గ్యారంటీగా పార్టీ టికెట్లు కూడా ఖాయమని ఆయన హామీ ఇచ్చేరు.
ఒకవేళ వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ స్థానాలు పెరగకపోతే అప్పుడు పార్టీలో ఉన్న పాత, కొత్త వారి పరిస్థితి ఏమిటి? రాష్ట్రంలో 300 పదవులు పంపకాలకి సిద్దంగా ఉన్నాయని చెపుతున్నప్పుడు మరి రెండేళ్ళుగా తెదేపాలో ఉన్నవాళ్ళకి వాటిని ఎందుకు ఇవ్వలేదు? అని ఆలోచిస్తే అది కూడా పాత, కొత్త వాళ్ళందరినీ మభ్యపెట్టడానికేనేమో అని అనుమానించవలసి వస్తోంది.
అయితే మంత్రి కృష్ణమూర్తి చెప్పిన ఈ మాటలు విన్న తరువాత ఇంకా ఎవరు ఏమనుకొన్నా తెదేపా వలసలను ప్రోత్సహిస్తుందని స్పష్టమయింది. బహుశః ఇంతకంటే విడమరిచి చెప్పడం సాధ్యం కాదేమో కూడా. ఒకప్పుడు అదే వైకాపాని తెదేపా నేతలు ఎన్ని తిట్లు తిట్టేవారో అందరికీ తెలుసు. వైకాపా అంటే అవినీతికి మారు పేరు అని అభివర్ణించేవారు. కానీ మంత్రి పల్లె రఘునాధ రెడ్డి వారికి తాజాగా కాండక్ట్ సర్టిఫికేట్ జారీ చేసారు.
“తెదేపాలో చేరాలనుకొంటున్న వైకాపా నేతలందరికీ మంచి నాయకత్వ లక్షణాలు, ప్రజా సమస్యల పట్ల మంచి అవగాహన ఉంది. వారు తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వైఖరితో విసుగెత్తిపోయే మా పార్టీలో చేరుతున్నారు. కనుక అందుకు ఆయననే తప్పు పట్టవలసి ఉంటుంది తప్ప మా పార్టీని కాదు,” అని అన్నారు.
అంటే తెదేపా అప్రజాస్వామికంగా ప్రతిపక్ష పార్టీల నుంచి నేతల వలసలను ప్రోత్సహిస్తోందనే అపవాదును కూడా స్వీకరించడానికి సిద్దంగా లేదని ఆయన చెపుతున్నట్లే భావించవచ్చును. కానీ మంత్రి కృష్ణమూర్తి చెప్పిన మాటలు అందుకు పూర్తిగా భిన్నంగా ఉండటం గమనార్హం. ఇంకా ముసుగులో గుద్దులాటలు లేకుండా తెదేపా తను వ్యూహం ఏమిటో విస్పష్టంగా బయటపెట్టింది కనుక ఇప్పుడు బంతి జగన్మోహన్ రెడ్డి కోర్టులోనే ఉందని భావించవచ్చును.
“ఇది అన్యాయం…అక్రమం…అప్రజాస్వామికం…”అంటూ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆక్రోశిస్తూ పార్టీలో నుంచి బయటకి వెళ్లిపోయేవారిని లెక్కపెడుతూ కూర్చోంటారో లేక తెదేపా వ్యూహానికి ప్రతివ్యూహం అమలు చేసి తన ఎమ్మెల్యేలని, పార్టీని కాపాడుకొని తన సత్తా నిరూపించుకొంటారో చూడాలి.