ముందే చెప్పుకొన్నట్లుగా తెదేపా-భాజపాల తెగతెంపుల ప్రక్రియ మొదలయిపోయింది కనుక శాస్త్ర ప్రకారం ఆ తంతు పూర్తి చేయడానికి ఆ రెండు పార్టీల నేతలు మాటల యుద్ధం మొదలుపెట్టేసారు. భాజపా నేత సోము వీర్రాజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నేరుగా విమర్శలు గుప్పిస్తే, దానికి తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అంతకంటే ఘాటుగా బదులిచ్చారు. బహుశః ఇక నుంచి ఆ రెండు పార్టీల విమర్శలు, ఆరోపణలను రోజూ మీడియాలో చూడవలసి ఉంటుందేమో?
సోము వీర్రాజు నిన్న తిరుపతిలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చాలా తీవ్రంగా విరుచుకుపడ్డారు. “ఈ రెండేళ్ళ కాలంలో కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేస్తున్న భారీ నిధులను వాడుకొంటూ, కేంద్రం సహాయసహకారాలతో రాష్ట్రంలో అమలవుతున్న పధకాలను చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వ స్వంత పధకాలుగా ప్రచారం చేసుకొంటూ, మళ్ళీ కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి సహాయం చేయడం లేదని నిందిస్తున్నారు. కేంద్రప్రభుత్వం ఒక్కో పంచాయితీ అభివృద్ధికి రూ.1000 కోట్లు ఇస్తుంటే, అదానికి ‘చంద్రన్న బాట’ అని పేరు పెట్టుకొని స్వంత పదకాలుగా ప్రచారం చేసుకొంటున్నారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి నిరంతర విద్యుత్ సరఫరా పధకం ద్వారా విద్యుత్ అందిస్తుంటే, రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా చేసిన ఘనత తనదేనని చంద్రబాబు నాయుడు చెప్పుకొంటున్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి చేసిందేమీ లేకపోయినా, ప్రధాని నరేంద్ర మోడికి కేంద్రప్రభుత్వానికి, మాకు దక్కవలసిన క్రెడిట్ ని తన స్వంత ఖాతాలో వేసుకొంటున్నారు. ఇక నుంచి మేము రాష్ట్రంలో ప్రతీ గ్రామానికి వెళ్లి కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న సహాయసహకారాల గురించి ప్రజలకు వివరిస్తాము,” అని సోము వీర్రాజు అన్నారు.
ఆయనకు బుద్దా వెంకన్న బదులిస్తూ “చంద్రబాబు నాయుడికున్న ప్రజాధారణ వలననే రాష్ట్రంలో భాజపాకి ఆ 4 సీట్లయినా వచ్చేయని సోము వీర్రాజు వంటి భాజపా నేతలు గుర్తుంచుకొంటే మంచిది. వారికి సమస్యలు ఏమయినా ఉన్నట్లయితే తమ అధిష్టానంతో మాట్లాడుకోవాలి కానీ ఈవిధంగా మా నాయకుడిని విమర్శిస్తే సహించబోము. రాష్ట్ర భాజపా నేతలలో సోము వీర్రాజు, పురందేశ్వరి, కన్నా లక్ష్మి నారాయణ వంటివారు తరచూ మా అధినేతపై అనుచితమయిన విమర్శలు చేస్తన్నారు. అది మానుకోకపోతే మేము గట్టిగా స్పందించవలసి వస్తుంది. అది రెండు పార్టీలకు మంచిది కాదు కనుక భాజపా పట్ల మా పార్టీ ఏవిధంగా మిత్రధర్మం పాటిస్తోందో, అది కూడా మా పార్టీ పట్ల అదేవిధంగా మిత్రధర్మం పాటించవలసి ఉంటుందని వారు గుర్తుంచుకోవాలి,” అని హెచ్చరించారు.