నడి సంద్రంలో పడవ మునిగిపోతునప్పుడు, ప్రాణాలు కాపాడుకోవడానికి రెండే రెండు మార్గాలుంటాయి. 1. ఆ దేవుడిని ప్రార్ధించడం. 2. శరీరంలో శక్తి ఉన్నంత వరకు ఏదో ఒక దిక్కులో ఈదడం. జగన్మోహన్ రెడ్డి మాటలు వింటుంటే ప్రస్తుతం ఆయన ఆ రెండు పనులే చేస్తున్నట్లుంది.
వైకాపా ఎమ్మెల్యేలను తెదేపాలో చేర్చుకోవడం మొదలుపెట్టిన తరువాత వైకాపా పరిస్థితి నడిసంద్రంలో మునుగుతున్న పడవలాగే తయారయింది. కడప జిల్లాలో తన స్వంత నియోజకవర్గం పులివెందులలో ఆయన పర్యటిస్తున్నప్పుడు తన పార్టీ కార్యకర్తలతో జగన్ మాట్లాడుతూ, “మనకి పైనున్న ఆ దేవుడి ఆశీసులు, ప్రజల ఆదరణ పుష్కలంగా ఉన్నాయి కనుక వచ్చే ఎన్నికలలో మనమే విజయం సాధిస్తాము. రెండేళ్ళు ఓపికపడితే అందరి కష్టాలు తీరిపోతాయి. పార్టీలో నుంచి కొందరు బయటకి వెళ్లిపోయినంత మాత్రాన్న మనం భయపడనవసరం లేదు. వాళ్ళందరూ వచ్చే ఎన్నికలలో కనబడకుండా కొట్టుకుపోతారు. మనం కూడా పార్టీలోకి వచ్చేవారిని ఆహ్వానిద్దాము,” అని జగన్ అన్నారు.
పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, నేతలు బయటకువెళ్ళిపోకుండా ఆపేందుకు జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ నిత్యం ఒకరో ఇద్దరో పార్టీని వీడి వెళ్లిపోతూనే ఉన్నారు. నిన్న రాత్రి గూడూరు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే సునీల్ చడీ చప్పుడు లేకుండా తెదేపాలో చేరిపోయారు. మళ్ళీ ఎల్లుండి వరుపులు సుబ్బారావు, 11వ తేదీన జ్యోతుల నెహ్రూలు తెదేపాలో చేరడానికి ముహూర్తాలు పెట్టుకొని ఎదురుచూస్తున్నారు. బహుశః ఇంకా చాలా మంది తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారేమో కూడా. వారిని ఇంక ఆపలేమని గ్రహించిన జగన్మోహన్ రెడ్డి దేవుడిపై, ప్రజలపైనే భారం వేసినట్లున్నారు. అంతవరకే అయితే అది సహజమేనని భావించవచ్చును. ఒకపక్క తన పార్టీని ఆ దేవుడే కాపాడాలి అని చెపుతూనే మళ్ళీ వచ్చే ఎన్నికలలో వైకాపాయే విజయం సాధిస్తుందని, అప్పుడు తనే ముఖ్యమంత్రి అవుతానని, అందరి కష్టాలు తీర్చేస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అదెలాగుంది అంటే ‘నైవేద్యం పెట్టు నా మహిమ చూపిస్తాను’ అన్నట్లుంది. ఇకనయినా జగన్మోహన్ రెడ్డి ఈ భ్రమ నుంచి బయటపడకపోతే ఇంకెన్నటికీ ఈ భ్రమలలోనే జీవించవలసి ఉంటుంది.