నారా లోకేష్ ని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించగానే, లోకేష్ ని ప్రసన్నం చేసుకొనేందుకు, ఆయన కోసం తమ పదవులను త్యాగాలు చేసేందుకు తెదేపాలో నేతలు, మంత్రులు పోటీలు పడుతుండటం విశేషం. పేరుకి ప్రజాసేవ కోసమే రాజకీయాలలో ఉన్నామని అందరూ చెప్పుకొంటున్నా, పదవులు, అధికారం, డబ్బు కోసమేనని అందరికీ తెలుసు. అతి కష్టం మీద వాటిని సంపాదించుకొన్న తరువాత మళ్ళీ వాటిని ఎవరికోసమో త్యాగం చేయాలనుకొంటే దానికీ ఓ లెక్కుంటుందని వేరేగా చెప్పనవసరం లేదు. అయితే తెదేపాలో నేతలు లోకేష్ కోసం త్యాగాలు చేయడానికి ఎంతగా పోటీలు పడుతున్నప్పటికీ తాజా సమాచారం ప్రకారం, ఆయనని రాజధాని ప్రాంతంలోని పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీచేయించి అసెంబ్లీలోకి అక్కడి నుంచి మంత్రివర్గంలోకి తీసుకురావాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పెనమలూరు నియోజకవర్గానికి తెదేపా తరపున బోడె ప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లోకేష్ ని దసరా రోజున లేదా అంతకంటే ముందుగానే మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి కనుక త్వరలోనే దీనిపై ఆయన తన సన్నిహితులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవచ్చును. ఈ వార్త తెదేపా గెజెట్ పేపర్ గా కొత్తగా గుర్తింపు పొందిన ఆంధ్రజ్యోతిలో వచ్చింది కనుక ఇది అ(న)ధికారిక ప్రకటన క్రిందే భావించవచ్చును.